పుష్ప మూవీతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న రష్మిక మంధన.. ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. దీనికి కారణం.. తాను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పడమే. అసలేం జరిగిందంటే… విక్కీ కౌశల్, రష్మిక జంటగా వచ్చిన ‘ఛావా(Chhaava)’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమె మాట్లాడిన తీరు వివాదాస్పదమైంది. రిలీజ్ కు ముందు ముంబయిలో జరిగిన ఈవెంట్లో.. నేను హైదరాబాద్ నుంచి వచ్చా.. అని చెప్పింది. దీంతో పుట్టిన ఊరినే మరచిపోయావా అంటూ కన్నడవాసులు ఫైర్ అవుతున్నారు. పుట్టిన ప్రాంతం పేరు చెప్పడానికి రష్మికకు వచ్చిన ఇబ్బందేంటో అంటూ పోస్టులు పెడుతున్నారు.
కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్ పేటకు చెందిన రష్మిక.. ‘కిరిక్ పార్టీ’ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఛలో’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టి ‘గీతా గోవిందం’తో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ‘పుష్ప’తో నేషనల్ క్రష్ గా మారిపోయింది. అయితే ‘ఛావా’ సినిమా ప్రమోషన్లో తన సొంతూరు హైదరాబాద్ అన్నట్లు మాట్లాడటం కన్నడ ఫ్యాన్స్ ని తీవ్రంగా హర్ట్ చేసింది. గతంలోనూ ఆమె ఇలాగే వ్యవహరించింది. తన తొలి సినిమా ‘కిరిక్ పార్టీ’ నిర్మాణ సంస్థ పేరును ప్రస్తావించకుండా.. పేపర్లో తన ఫొటో చూసి ఓ నిర్మాణ సంస్థ అవకాశం ఇచ్చిందని చెప్పింది. అవకాశమిచ్చిన సంస్థ పేరు కూడా చెప్పడానికి ఇష్టపడట్లేదంటూ అప్పుడూ చాలా మంది ఫైర్ అయ్యారు.