జనాల్లో సినిమా షూటింగ్ ఉందంటేనే అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. మరి టాప్ స్టార్స్ నిజంగానే ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. నగరాలు లేదా పట్టణాల్లో నిర్వహించే ప్రోగ్రాంలకే ఫ్యాన్స్ గోల మామూలుగా ఉండదు. కానీ అత్తగారింటికి, అదీ మారుమూల ప్రాంతానికి వచ్చిన అల్లు అర్జున్ కి అదే అనుభవం ఎదురైంది. తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కొత్తగా నిర్మించిన ఫంక్షన్ హాల్ ను ప్రారంభించేందుకు ఆయన నల్గొండ జిల్లా టూర్ పెట్టుకున్నారు. ఈ ఫంక్షన్ హాల్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓపెన్ చేశారు. పెద్దవూర మండలం కొత్తగూడెంలో తయారైన ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ కు వచ్చిన అల్లు అర్జున్ రావడంతో… సమీప ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. మరోవైపు ఫ్యాన్స్ సైతం భారీగా తరలివచ్చారు.
ఐకాన్ స్టార్ ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తోపులాట జరిగింది. పోలీసులు ఎంతగా ట్రై చేసినా కంట్రోల్ కాలేదు. చంద్రశేఖర్ రెడ్డి BRS నాయకుడు కాగా.. నాగార్జునసాగర్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ల దృష్ట్యా ఈ ఫంక్షన్ హాల్ ను నిర్మించారు. పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే నాగార్జునసాగర్ నుంచి పోటీకి దిగుతానని అల్లు అర్జున్ మామ చెప్పారు. మరోసారి అత్తారింటికి రావడం, పెద్దసంఖ్యలో తనకు వెల్ కం చెప్పడం ఆనందంగా ఉందని ఈ సినీ స్టార్ అన్నారు. భార్య, పిల్లలతో కలిసి అల్లు అర్జున్ అత్తారింటికి వచ్చారు. ఏటా దసరా లేదా ప్రత్యేక పండుగ సందర్భంగా మాత్రమే ఆయన అత్తారింటికి వెళ్తుంటారు.