పాండమిక్ తర్వాత ఓటీటీ మార్కె్ట్ విస్తృతంగా పెరిగిపోయింది. ఇదే క్రమంలో పెరిగిన ధరలు మల్టిప్లెక్స్‌లలో సినిమా చూడటాన్ని భారంగా మార్చాయి. టికెట్ రేటు పక్కన పెడితే.. ఈ తరహా థియేటర్లలో ఫుడ్, బేవరేజ్ రేట్లు మధ్యతరగతి ప్రేక్షకుడిని సినిమాకు దూరం చేస్తున్నాయి. సినిమా హాళ్లలో అందించే ఆహారంపై పన్ను రేటును గణనీయంగా తగ్గిస్తున్నట్లు 50వ GST కౌన్సిల్ ప్రకటించింది. మల్టీప్లెక్స్‌లలో సాధారణంగా వినియోగించే పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ వంటి వస్తువులపై పన్నును 18% నుంచి 5%కి తగ్గించారు.
ఈ నిర్ణయం సినీ ప్రేక్షకులతో పాటు వినోద పరిశ్రమకు ఊరట కలిగిస్తుందనడంలో సందేహం లేదు. కాగా.. ఫుడ్ ఐటెమ్స్‌పై పన్ను భారాన్ని తగ్గించడం ద్వారా, ఫిల్మ్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ను, సినిమా హాళ్లను పెంపును ప్రోత్సహించడమే GST కౌన్సిల్ లక్ష్యం. అయితే సినిమా టిక్కెట్లతో పాటు పాప్‌కార్న్ లేదా కూల్ డ్రింక్స్ వంటి ఆహార పదార్థాల సరఫరాను కలిపి ఒకే ప్యాకేజీగా విక్రయిస్తే, ఇది కాంపోజిట్ సప్లయ్గా పరిగణించబడుతుంది. అటువంటి సందర్భాల్లో ఈ ప్యాకేజీలో ప్రధాన సరఫరా అయిన సినిమా టికెట్‌కు వర్తించే రేటు.. పన్ను రేటును నిర్ణయిస్తుంది. ప్రస్తుతం రూ.100 కంటే తక్కువగా ఉన్న సినిమా టికెట్లపై 12% పన్ను విధించబడుతోంది. అయితే పరిమితి కంటే ఎక్కువ ఉన్న వాటికి 18% GST వర్తిస్తుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జులై 11న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో రాష్ట్ర ప్రతినిధుల బృందం కూడా పాల్గొంది. మీటింగ్ అనంతరం మంత్రి సీతారామన్ జీఎస్టీ కౌన్సిల్ సమావేశ ఫలితాలను తెలియజేసేందుకు మీడియా సమావేశం నిర్వహించారు. కాగా.. ఇంత పెద్ద ఉపశమనం కలిగించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సినీ ప్రేమికులు కృతజ్ఞతలు తెలిపారు.