తండ్రి, కూతురు సెంటిమెంట్ తో రూపుదిద్దుకుంటున్న మూవీ ‘హాయ్ నాన్న’. నేచురల్ స్టార్ నాని నటించిన ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్నది. డిసెంబరు 7న సినిమా విడుదల కానుందని నిర్మాతలు ఇప్పటికే హింట్ ఇచ్చారు. మృణాల్ ఠాకూర్ కథానాయిక కాగా.. జయరామ్, ప్రియదర్శిని, అంగద్ బేడు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీలోని అమ్మాడి సాంగ్ లాంచ్ ఈవెంట్ ను 10 రోజుల కిందట నిర్వహించారు. శౌర్యవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు హీషమ్ అబ్దుల్ వాహబ్ స్వరాలు అందించారు.
‘ఇటు రావే నా గాజు బొమ్మ.. నేనే నాన్న, అమ్మ’ అంటూ సాగే ట్యూన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఛైల్డ్ యాక్టర్ కియారా ఖన్నా ఇందులో నాని కుమార్తె పాత్రను పోషించింది. యశ్నా పాత్రధారి మృణాల్ ఠాకూర్.. హీరో నానితో ప్రేమలో పడుతుంది. అయితే అంతకుముందే ఆమె ఇంకొకరికి మనసు ఇస్తుంది. దీంతో నానికి తీవ్రంగా కోపం వస్తుంది. అయితే తర్వాత ఏం జరుగుతుంది.. చిన్నారి మహి నిజంగానే నాని కూతురా అన్నది థియేటర్లలో చూడాలని చెబుతోంది ప్రొడక్షన్ యూనిట్. వైరా ఎంటర్టెయిన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మాణమవుతున్నది.
నాని-మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో వస్తున్న తొలి మూవీ ‘హాయ్ నాన్న’. జులైలో ఈ సినిమా షూటింగ్ మొదలు కాగా.. పాన్ ఇండియా రేంజ్ లో 5 భాషల్లో విడుదల చేయాలని చూస్తున్నారు. దుల్ఖర్ సల్మాన్ జోడీగా 2022లో విడుదలై బాక్సాఫీస్ ను బద్ధలు కొట్టిన ‘సీతారామం’ తర్వాత మృణాల్ నటిస్తున్న రెండో తెలుగు మూవీ ఇది.