Published 13 Jan 2024
హిట్ టాక్, హౌజ్ ఫుల్ బోర్డులతో సాగుతున్న ‘హనుమాన్’ సినిమా.. కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్నది. వందలాది కోట్లు వెచ్చిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రూ.25 కోట్లతో తెరకెక్కి చిన్న సినిమాగా ముద్రపడ్డ ‘హనుమాన్’ ముందు.. పెద్ద పెద్ద మూవీలు బలాదూర్ అనిపిస్తున్నాయి. నిర్మాణానికి అయిన ఖర్చు మొత్తం కేవలం మొదటి రోజునే వసూలు కావడం చూస్తేనే దీని ఆదరణ గమనించవచ్చు. ప్రపంచవ్యాప్తం(Worldwide)గా ఫస్ట్ డే నాడు రూ.20 కోట్లకు పైగా వసూళ్లు దాటినట్లు సినీ విశ్లేషకులు(Movie Experts) అంటున్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న థియేటర్లలోకి వచ్చిన ‘హనుమాన్’ మూవీని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. విజువల్స్ కు ఫిదా అవుతున్న ఆడియన్స్ తో మరిన్ని థియేటర్లలో సినిమాను వేయాలన్న ఆలోచన చేస్తున్నారు. తేజ సజ్జా నటించి పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ‘హనుమాన్’కు ఉత్తర భారతంలోనూ భారీగానే స్పందన కనిపిస్తున్నట్లు చిత్ర యూనిట్ చెబుతున్నది.
నైజాంలో అన్యాయం…
చిన్న సినిమాల పట్ల ఎంతటి చిన్నచూపు ఉంటుందో మరోసారి నిరూపణ అయింది. ‘హనుమాన్’ సినిమా ప్రదర్శన(Show)లకు సంబంధించి నైజాం ఏరియాలో వివాదం ముదిరింది. ముందుగా చేసుకున్న ఒప్పందాన్ని నైజాంలోని కొన్ని థియేటర్లు ఉల్లంఘించడంతో ఈ మూవీ నిర్మాతలు కంప్లయింట్ ఇచ్చారు. దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ తోపాటు చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిని ఆశ్రయించారు. ఇలాంటి చర్యల వల్ల తెలుగు సినిమా పరిశ్రమ ప్రమాదంలో పడుతుందని TFPC(Telugu Film Producers Council) గట్టిగానే స్పందించింది.
జరిగిన కథ ఇది…
రిలీజైన రోజు నుంచి షోలు నడపుతామంటూ.. ‘హనుమాన్’ సినిమా బాధ్యత చూస్తున్న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తో ఒప్పందం చేసుకున్నారు నైజాం ఏరియాలోని పలు థియేటర్ల యజమానులు(Owners). కానీ ఈ ఒప్పందాన్ని తెలంగాణలోని థియేటర్ల ఓనర్లు పట్టించుకోకపోవడం, అనుకున్నట్లుగా షోలు వేయక నిర్మాతలకు పెద్దయెత్తున రెవెన్యూ కోల్పోవాల్సి వచ్చింది. దీంతో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే విధంగా చర్యలు చేపట్టింది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. ‘ముందుగా అనుకున్న ప్రకారం మూవీ షోలు వేయాలి.. ఇప్పటివరకు షోలు వేయకపోవడం వల్ల జరిగిన నష్టాన్ని ఒప్పందాన్ని ఉల్లంఘించినవాళ్లే భరించాలి’ అంటూ TFPC క్లారిటీ ఇచ్చింది. ఈ నిర్ణయంతో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కు విజయం దక్కినట్లయింది. బెస్ట్ విజువల్స్ ఫ్రేమ్ వర్క్ తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు సినీ ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా కథలో దమ్ముంటే ఒకరు అన్యాయం చేసినా విజయం ఆగదు అని ‘హనుమాన్’ సినిమా నిరూపించింది.