
Published 02 Jan 2024
నిన్నటివరకు ఆ అగ్రహీరో.. అక్కడే సినిమా షూటింగ్ ల్లో పాల్గొన్నారు. రోజంతా అదే ప్రాంతంలో తిరుగుతూ వివిధ సీన్లలో నటించారు.. వీరంతా అక్కణ్నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడే పెద్ద ఉపద్రవం వచ్చిపడింది. వారు ఆ ప్రాంతం నుంచి అలా బయటపడ్డారో లేదో ఒక్కసారిగా పెను విపత్తు విరుచుకుపడింది. క్షణాల్లో తలెత్తిన ఉప్పెనతో అల్లకల్లోలమైన ఆ ప్రాంతాల్ని మనసులో తలచుకుంటూ ఆ హీరో బాధపడ్డారు. ఈ వింత అనుభవాన్ని ఎదుర్కొంది టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ అయితే… ఆ ఘటన జరిగింది జపాన్ లో. భూకంపంతో అతలాకుతలమై సునామీ వార్నింగ్ తో ప్రజల పరిస్థితి దారుణంగా తయారైతే.. అదే వాతావరణం నుంచి క్షేమంగా బయటపడ్డారు జూనియర్ NTR.

వారం రోజులు జపాన్ లోనే…
జపాన్ లో వచ్చిన భూకంపంపై జూనియర్ NTR దిగ్భ్రాంతి చెందుతూ తాను షూటింగ్ కోసం తిరిగిన ప్రాంతాలను గుర్తు చేసుకున్నారు. ఆ దేశంలో షూటింగ్ ముగించుకుని రాత్రికి ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ‘దేవర’ సినిమా చిత్రీకరణ కోసం జపాన్ వెళ్లిన తారక్.. వారం రోజుల పాటు అక్కడే ఉన్నారు. ప్రస్తుతం భూకంపం వచ్చిన ప్రాంతంలోనే ఆయన విస్తృతంగా షూటింగ్ లో పాల్గొన్నారు. ”దేవర’ షూటింగ్ జరిగిన ప్రాంతంలోనే ఇన్నిసార్లు భూకంపం రావడం నా హృదయాన్ని కలచివేసింది.. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు దృఢంగా ఉండాలి… వారంతా త్వరగా కోలుకోవాలి’ అని NTR ఆనాటి అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు.
అలలతో సీన్లు… నిజంగానే ఘటన
ఎగసిపడుతున్న అలలు.. పడవపై దూసుకొస్తున్న NTRతో కూడిన పోస్టర్ ను అభిమానులతో చిత్ర యూనిట్ పంచుకుంది. NTR, కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ‘దేవర’.. ఈ జోడీకి రెండో సినిమాగా నిలిచిపోతుంది. మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ గా వస్తున్న ఈ మూవీని.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. రెండు పార్ట్ లుగా ఈ సినిమా రానుండగా ఫస్ట్ పార్ట్ ను ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ కథానాయిక కాగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. మరో బాలీవుడ్ అగ్రనటుడు సైఫ్ అలీఖాన్.. ‘దేవర’లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ‘RRR’ ప్రభంజనంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఎన్టీఆర్ కు.. జపాన్ లోనూ పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ తయారయ్యారు.