సినిమాను ముందస్తుగా వీక్షించేందుకు ఏర్పాటు చేసే బెనిఫిట్ షోల(Benefit Shows)పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నామంటూనే ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారంటూ అసహనం చెందింది. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత, అనంతరం తెల్లవారుజామున వేసే ప్రదర్శనలకు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారని ప్రశ్నించింది. ఇలాంటి పర్మిషన్లపై పునఃసమీక్షించాలని ప్రభుత్వానికి సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ‘గేమ్ ఛేంంజర్’ మూవీ టికెట్ల ధరలు, బెనిఫిట్ షోలపై దాఖలైన కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. భారీ బడ్జెట్ తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి ఇలా టికెట్ల ధరలు పెంచడం, బెనిఫిట్ షోల ద్వారా రాబట్టడం సరికాదని చెబుతూనే వీటిపై దృష్టిసారించాలంటూ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.
పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా 2024 డిసెంబరు 4న సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగి రేవతి మృతిచెందగా, ఆమె తనయుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. దీనిపై సీరియస్ అయిన ప్రభుత్వం ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని ప్రకటించింది. దీనిపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టంగా చెప్పినా.. తిరిగి గేమ్ ఛేంజర్ కోసం మళ్లీ రూల్స్ ను సడలించారు.