తెలుగు సినీ నిర్మాతకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం(Court) తీర్పునిచ్చింది. దీనికితోడు భారీగా రూ.95 లక్షల జరిమానా(Fine) విధించింది. చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేశ్… ఒంగోలు కోర్టుకు హాజరయ్యారు. వాద, ప్రతివాదనలు విన్న కోర్టు.. జరిగింది నేరమని భావించి తీర్పును ఖరారు చేసింది. 2019లో ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద రూ.95 లక్షలను గణేశ్ తీసుకున్నట్లు.. ఆ డబ్బుని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ పేరుతో చెక్కు తీసుకున్నట్లు బాధితుడి తరఫు న్యాయవాది(Lawyer) కోర్టుకు తెలిపారు.
అప్పీలుకు అవకాశం…
చెక్ ఇచ్చినా అది బౌన్స్ కావడంతో న్యాయం కోసం బాధితుడు కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ నిర్వహించిన న్యాయస్థానం… నిర్మాత బండ్ల గణేశ్ కు ఏడాది జైలు శిక్షతోపాటు రూ.95 లక్షల జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు వీలుగా నెల రోజుల గడువు(Time) ఇచ్చింది. ‘సింధూరం’, ‘సుస్వాగతం’, ‘నువ్వు నాకు నచ్చావ్’తోపాటు 30కి పైగా సినిమాల్లో గణేశ్ నటించారు.
నటుడి నుంచి నిర్మాత దాకా…
నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గణేశ్.. 2009లో ‘ఆంజనేయులు’ మూవీ నుంచి నిర్మాతగా మారారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తో ‘తీన్మార్’, ‘గబ్బర్ సింగ్’, తీయగా… ‘బాద్ షా’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘నీ జతగా నేనుండాలి’ సినిమాల్ని నిర్మించారు. మధ్యమధ్యలో రాజకీయ నాయకుడిగా వివిధ పార్టీలను విమర్శిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.