ఇద్దరు తెలుగు సినీ నిర్మాతల(Cine Producers) ఇళ్లల్లో భారీస్థాయిలో IT సోదాలు జరుగుతున్నాయి. ఏకకాలంలో 8 చోట్ల 55 టీంలతో కూడిన అధికారుల బృందాలు… నిర్మాత దిల్ రాజుతోపాటు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో తనిఖీలు చేస్తున్నాయి. దిల్ రాజు ఆఫీస్ సహా కుటుంబ సభ్యుల ఇళ్లనూ వదిలిపెట్టడం లేదు. ఆయన సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితరెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల ఇళ్లున్న జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ కు ఉదయం నుంచే అధికారుల రాక మొదలైంది. డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి బడా నిర్మాతగా ఎదిగిన దిల్ రాజు.. భారీ బడ్జెట్ తో నిర్మించిన రెండు సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల చేశారు.
రాంచరణ్ తో ‘గేమ్ ఛేంజర్’, వెంకటేశ్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ తీశారు దిల్ రాజు. ‘గేమ్ ఛేంజర్’ నిరాశపరిచినా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికే తొలివారంలో రూ.100 కోట్లు దాటిన ఆ మూవీ రూ.200 కోట్ల క్లబ్ లో చేరబోతోంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన మైత్రీ నవీన్, CEO చెర్రీతోపాటు భాగస్వాముల(Partners) ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సంస్థ నిర్మించిన పుష్ప-2 ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1,850 కోట్లు వసూలు చేసింది.