సీనియర్ నటుడు నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతికి కోర్టు షాక్ ఇచ్చింది. బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో నరేశ్ కు రిలీఫ్ లభించింది. ఆయన నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమాను థియేటర్లు, Ottల్లో రిలీజ్ కాకుండా నిలిపివేయాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు ఆ పిటిషన్ ను కొట్టిపారేసింది. పూర్తిస్థాయిలో వాదనలు విన్న కోర్టు.. మెరిట్ లేని కారణంగా రమ్య రఘుపతి పిటిషన్ కు కొట్టేసినట్లు పేర్కొంది. ఈ సినిమాకు ఇచ్చిన సర్టిఫికెట్ విషయంలో… కంటెంట్ పూర్తిగా కల్పిత కథ అని నమ్మిన తర్వాతే దాన్ని ఇష్యూ చేశారని న్యాయస్థానం అభిప్రాయపడింది. కల్పిత కథ అని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇస్తే సదరు సినిమా రిలీజ్ ను అడ్డుకోవడానికి వీలు లేదని స్పష్టం చేసింది. ఈ మూవీని ఎక్కడైనా షో చేసుకునేందుకు ప్రొడ్యూసర్స్ అన్ని హక్కులు ఉన్నాయని తీర్పు ఇచ్చింది.
విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో క్లోజ్ గా ఉంటూ నరేశ్ ‘మళ్లీ పెళ్లి’ సినిమా తీశారని, తన వ్యక్తిగత లైఫ్ ను టార్గెట్ చేస్తూ దీన్ని షూట్ చేశారంటూ రమ్య రఘుపతి కోర్టుకు వెళ్లారు. నరేశ్, రమ్య ఆరేళ్లుగా విడివిడిగా ఉంటున్నారని, వారిద్దరూ కలిసి ఉండటం లేదని కోర్టు నిర్ధారించింది. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం భార్యభర్తలు రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దూరంగా ఉంటే ఆ పెళ్లి రద్దవుతుందని తీర్పులో పేర్కొంది.