ఆస్కార్(Oscar) అవార్డులకు ‘లాపతా లేడీస్’ చిత్రం ఎంట్రీ పొందింది. 97వ ఆస్కార్ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రంగా ఈ మూవీని ఎంపిక చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రానికి కిరణ్ రావ్ దర్శకురాలు. 2023 సెప్టెంబరు 8న 48వ టొరంటో ఇంటర్నేషనల్ ఫెస్టివల్(TIFF)లో ప్రదర్శితమై(Screened) ప్రశంసలు అందుకున్న ఈ మూవీ 2024 మార్చి 1న రిలీజైంది. ప్రతిభా రాణా, స్పర్శ్ శ్రీవాస్తవ, రవికిషన్ తదితరులు నటించారు.
‘దోబీఘాట్’ వంటి విలక్షణమైన సినిమా తీసిన కిరణ్ రావ్.. వెరైటీ కాన్సెప్ట్ తో ఈ మూవీ తీశారు. పెళ్లయిన కొత్త జంట రైలులో జర్నీ చేస్తుంటుంది. అదే బోగీలో మరో రెండు జంటలు ఉండగా.. ఆ పెళ్లికూతుళ్లంతా తమ ఆచారం ప్రకారం ముసుగుతో ఉంటారు. ఇక హీరో రైలు దిగి బ్యాండ్ మేళంతో ఇంటికి చేరుకోగా.. హారతి ఇచ్చే సమయంలో పెళ్లి కూతురు ముసుగు తీసి చూస్తే అంతా షాక్ అవుతారు. అసలు పెళ్లికూతురుకు బదులు మరో అమ్మాయి రావడమే ‘లాపతా లేడీస్’ స్టోరీ లైన్.