వరల్డ్ వైడ్ గా భారీగా కలెక్షన్లు సాధిస్తున్న ‘కల్కి 2898 AD’ మూవీ.. సనాతన ధర్మాన్ని పాటించలేదా..! హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చిత్రీకరించారా..! ఇప్పుడీ ఈ అంశాలపైనే కల్కి టీమ్ లీగల్ నోటీసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిర్మాతల(Producers)తోపాటు అందులో నటించిన యాక్టర్లకు ఉత్తరప్రదేశ్ సంభాల్ లోని కల్కిధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ నోటీసులు పంపారు.
‘సనాతన గ్రంథాలను మార్చకూడదు.. హిందువుల మనోభావాలతో ఆడుకోవడం సినిమావాళ్లకు కాలక్షేపం(Time Pass)గా మారింది.. కల్కి నారాయణ భగవానుడు మనకు కేంద్రంగా ఉన్నాడు.. విశ్వాసాలు, భావోద్వేగాలు, ఆధ్యాత్మికతతో కూడిన దేశం భారత్.. ఇక ఇటువంటి అనైతిక చర్యలను సహించేది లేదు..’ అంటూ ప్రమోద్ కృష్ణమ్ హెచ్చరించారు.
భారత పురాణాల ఆధారంగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె వంటి స్టార్లు నటించారు. కల్కి పుట్టుకను పురాణాల్లో మాదిరిగా చూపించలేదని, కృత్రిమ గర్భంలో కల్కి జన్మిస్తారంటూ చెప్పడంపై అభ్యంతరం చెబుతూ నిర్మాతలతోపాటు ప్రభాస్, అమితాబ్ కు లీగల్ నోటీసులు పంపించడంతో.. సనాతన ధర్మం గురించి మరోసారి చర్చ ప్రారంభమైంది.