నేషనల్ లెవెల్లో ఉత్తమ చిత్రాలు రూపొందించే మలయాళ చిత్ర పరిశ్రమ(Cine Industry).. వేధింపుల ఆరోపణలతో మరక అంటించుకుంది. వేధింపులకు గురైన ఒక్కొక్కరు ‘మీటూ’ పేరుతో బయటకు వస్తున్నారు. దీంతో కీలక స్థానాల్లోని సినీ ప్రముఖులు జవాబిచ్చుకోలేక పదవుల్ని వదిలిపెడుతున్నారు. జస్టిస్ హేమ కమిటీ నివేదిక దృష్య్టా.. మహిళలపై వేధింపులతో కేరళ అట్టుడికిపోతున్నది.
ఒక ప్రాజెక్టు గురించి చర్చించేటప్పుడు డైరెక్టర్ రంజిత్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బెంగాలీ నటి శ్రీమిత్రలేఖ ఆరోపణలు చేశారు. రంజిత్ వాటిని కొట్టివేస్తూనే కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. 2016లో సిద్ధిఖీ వేధింపులకు పాల్పడ్డారని నటి రేవతి సంపత్ చెప్పడంతో అతను అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్(AMMA) ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు.
ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’ ఊహించని స్థాయికి చేరిందని కేరళ రిటైర్డ్ హైకోర్టు జడ్జి సర్కారుకు రిపోర్ట్ ఇచ్చారు. ‘కాంప్రమైజ్’, ‘అడ్జస్ట్ మెంట్స్’ పదాలను పాస్ వర్డ్ లుగా వాడుతున్నట్లు… కొత్తవాళ్లకు ప్రొడక్షన్ స్థాయిలోనే ‘కోడ్ నంబర్లు’ ఇస్తున్నట్లు గుర్తించింది. నాలుగేళ్ల తర్వాత ఆ రిపోర్టు వెలుగులోకి రాగా.. నటీమణులు క్రమంగా బయటకు వస్తున్నారు.
ప్రముఖ హీరోయిన్ పై కొందరు కారులోనే అత్యాచారానికి పాల్పడటంతో ఇండస్ట్రీపై రీసెర్చ్ చేయించాలంటూ వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్(WCC).. కేరళ CM పినరయిని 2017లో కోరింది. సర్కారు జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది. ఇలా రిపోర్ట్ ఇవ్వడం భారత సినీ చరిత్రలోనే తొలిసారి. ఇండస్ట్రీలో మాఫియా తయారైందని, ‘ఎస్’ చెప్పనివారిని బ్యాన్ చేసే స్థాయికి చేరిందన్నది రిపోర్ట్ సారాంశం. ఇలాంటి పరిస్థితుల్లో ‘అమ్మ’ అధ్యక్ష పదవికి సీనియర్ నటుడు మోహన్ లాల్ కూడా రాజీనామా చేశారు. అద్భుత సినిమాలు ఇచ్చే మల్లూవుడ్.. వేధింపుల ఆరోపణలతో పరువు పోగొట్టుకుంది.