బెయిల్ కోసం నటుడు మోహన్ బాబు తిప్పులు పడుతూనే ఉన్నారు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం(Reject)తో సుప్రీం మెట్లెక్కారు. మంచు కుటుంబం గొడవను కవర్ చేసేందుకు జల్ పల్లిలోని ఆయన ఇంటికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడగా పహాడీషరీఫ్ ఠాణాలో కేసు ఫైల్ అయింది. మోహన్ బాబు-మనోజ్ వివాదంలో ఇప్పటికే మూడు FIRలు నమోదు కాగా.. విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులిచ్చారు. జర్నలిస్టుపై దాడి కేసులో హైకోర్టును ఆశ్రయిస్తే.. డిసెంబరు 24న పోలీసుల ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.
కానీ కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించి విచారణకు హాజరు కాకపోవడంతో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు హైకోర్టు. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బెంచ్ విచారణ ప్రారంభించింది. అయితే సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అందుబాటులో లేకపోవడంతో మోహన్ బాబు తరఫు లాయర్ పాస్ ఓవర్ కోరినా అంగీకరించని కోర్టు.. విచారణను గురువారానికి వాయిదా వేసింది. అయితే రోహత్గీ ఆలస్యంగా కోర్టుకు రావడం, అందుకు వివరణ ఇచ్చి విచారణ కొనసాగించాలని విజ్ఞప్తి చేసినా ధర్మాసనం ఒప్పుకోకపోవడంతో విచారణ ఆరోజే జరగనుంది.