మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవ బజారుకెక్కితే ఇప్పుడాయన విరుచుకుపడి మీడియాపై దాడికి దిగారు. దీంతో జల్ పల్లిలోని ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మీడియా ప్రతినిధులపైకి దూసుకువచ్చిన ఈ సీనియర్ నటుడు, వారిపై చేయి కూడా చేసుకున్నారు. అంతకుముందు మనోజ్ దంపతులు అక్కడకు వెళ్లగా గేటు తీయలేదు. గేటు తెరవాలంటూ సెక్యూరిటీ సిబ్బందిపై మనోజ్ గట్టిగా అరిచినా లాభం లేకుండా పోయింది. దీంతో అతడు కోపంగా వారిని నెట్టుకుంటూనే లోపలికి వెళ్లిపోయారు. తన కుమార్తె లోపలే ఉందంటూ గట్టిగా మాట్లాడారు.
లోపలికి వెళ్లిన మనోజ్ పై దాడి జరగ్గా చిరిగిన షర్ట్ తో ఆయన బయటకు వచ్చారు. మనోజ్ కు తోడుగా వచ్చిన బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించివేశారు. మోహన్ బాబు దాడిలో కెమెరామన్ కు గాయం కాగా.. తర్వాత మీడియా ప్రతినిధుల్ని బయటకు పంపి గేట్లు వేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో మోహన్ బాబు, విష్ణు గన్స్ ను సీజ్ చేశారు. మనోజ్ కు జన్మనివ్వడమే నేను చేసిన పాపమా అంటూ మోహన్ బాబు మాట్లాడారు.