‘మంచుకురిసే వేళలో’ అంటూ హాయిదనాన్ని… ‘రంగులలో కళవో’ అంటూ సాగే ప్రేయసీప్రియుల హృద్యగీతాన్ని… ‘సింగారాల పైరుల్లోనా బంగారాలే పండేనంటా’ అంటూ హృదయాన్ని హత్తుకునే పాటల్ని అందించిన వ్యక్తి మ్యూజిక్ మేస్ట్రో(Music Maestro) ఇళయరాజా. మెలోడీ పాటలతో ఇంటిల్లిపాదినీ అలరించిన ఈ మ్యూజిక్ మాంత్రికుని జీవిత కథ(Biopic) ఆధారంగా సినిమా తెరకెక్కబోతున్నది. మ్యూజిషియన్(Musician)గా ఖండాంతర ఖ్యాతిని పొందిన ఇళయరాజా.. చిత్ర పరిశ్రమకు ఎన్నో వైవిధ్యభరితమైన పాటలు అందించారు. ఆర్.జ్ఞానేతిసిగన్ కాస్తా ఇళయరాజాగా మారితే… తమిళ చిత్రసీమ ఆయన్ను ‘ఇళయరాజా మ్యాస్ట్రో ఇసాయిజ్ఞాని’ అని పిలుచుకుంటుంది.
డైరెక్టర్ అతడే…
రాజా బయోపిక్ ను బాలీవుడ్ డైరెక్టర్ ఆర్.బాల్కి రూపొందిస్తారన్న ప్రచారం జరిగినా అది నిజం కాదని తేలిపోయింది. తమిళ స్టార్ ధనుష్ లీడ్ రోల్ లో నటించనున్న ఈ ప్రాజెక్టును అరుణ్ మాథేశ్వరన్ డైరెక్ట్ చేయబోతున్నారు. ధనుష్ హీరోగా ‘కెప్టెన్ మిల్లర్’ రూపొందించిన అరుణ్ మాథేశ్వరనే ఇళయరాజా బయోపిక్ ను తీయనున్నారు. దేశంలో ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటూ 2013లో CNN-IBN నిర్వహించిన దేశవ్యాప్త పోల్ లో ఇళయరాజాకు 49% ఓట్లు పడ్డాయంటే ఆయన క్రెడిట్ ఏంటో తెలిసిపోతుంది.
ఇదీ రాజా ఘనత…
ఐదు దశాబ్దాల పాటు చిత్రరంగాన్ని ఏలుతున్న ఇళయరాజా.. 7,000 పాటల్ని కంపోజ్ చేశారు. 1,000 సినిమాలకు పనిచేసిన ఈయన సేవల్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వాలు 2010లో ‘పద్మభూషణ్’, 2018లో ‘పద్మ విభూషణ్’ ప్రకటించాయి. మ్యూజిక్ ప్రియులందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ మూవీ షూటింగ్.. ఈ అక్టోబరులో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అనుకున్నట్లు సాగితే 2025 మధ్య నాటికి ఇళయరాజా బయోపిక్ విడుదలవుతుంది.
80 వసంతాలు…
జూన్ 3న పుట్టిన ఇళయరాజా 2023లో 80 వసంతాలు పూర్తి చేసుకున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, ఇళయరాజా పుట్టినరోజులు ఒకటే కావడం విశేషం. జూన్ 3న తమిళ ప్రజలు కరుణానిధి బర్త్ డే మాత్రమే జరుపుకోవాలన్న ఉద్దేశంతో తన జన్మదినాన్ని జూన్ 2నే నిర్వహించుకుని ఆయనకు గౌరవాన్ని కల్పించిన వ్యక్తిగా ఇళయరాజా నిలిచిపోయారు.