Published 29 Dec 2023
సినిమా, టీవీ, నాటక రంగాల్లో ప్రతిభ చూపే వారిని గుర్తించి అందజేసే అవార్డుల విషయం మరిచిపోయి చాలా కాలమే అయింది. గతంలోని ప్రభుత్వాలు అవార్డుల్ని అందజేసి కళాకారుల్ని ప్రోత్సహించేవి. కానీ రానురాను వాటి ఆలోచన లేకపోవడంతో నటీనటుల్లో తీవ్ర ఆవేదన ఏర్పడింది. అయితే త్వరలోనే మళ్లీ అవార్డులు ఇచ్చే యోచనలో కొత్త ప్రభుత్వం కనిపిస్తోంది. నూతన సంవత్సరంలో ‘నంది అవార్డు’ల్ని(Nandi Awards) తిరిగి అందజేస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలియజేశారు. సినీ ఇండస్ట్రీని సత్కరిస్తే తమకూ మంచి పేరు వస్తుందన్న మంత్రి.. వచ్చే ఉగాది(Ugadi) నుంచి అవార్డుల్ని అందజేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.
అర్ధ శతాబ్దపు నట జీవితం…
సీనియర్ నటుడు మురళీమోహన్ 50 సంవత్సరాల సినీ జీవితాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వేడుకకు కోమటిరెడ్డి హాజరై ఆయనను నటసింహ చక్రవర్తి బిరుదుతో సత్కరించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ ఆవేదనాపూరితంగా మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత అవార్డులు కనిపించకుండా పోయాయని, అటు జగన్ ప్రభుత్వంలో నంది అవార్డులు ఇవ్వలేదని, ఇటు KCR సర్కారు సైతం వాటికి దూరంగా ఉందని అన్నారు. ‘సింహ’ పేరుతో అవార్డులిస్తామని KCR చెప్పినా అది అమలు జరగలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనైనా ఈ పురస్కారాల్ని ఇస్తారని ఆశతో ఉన్నామని, ముఖ్యమంత్రిని కలిసే అవకాశమిస్తే ఇదే విషయాన్ని ఆయనకు తెలియజేస్తామన్నారు.