యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ నిఖిల్ సిద్ధార్థ్ ఇటీవలే ‘స్పై’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడులైన ఈ చిత్రం నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుండటంతో సంతోషంగా ఉన్న నిఖిల్.. ఇతర రాష్ట్రాల అభిమానులకు క్షమాపణలు చెప్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. రిలీజ్‌కు ముందు ప్రకటించినట్లుగా ఇతర భాషల్లో ‘స్పై’ మూవీని విడుదల చేయనందుకు ఈ విధంగా వివరణ ఇచ్చుకున్నారు.
‘కాంట్రాక్ట్/కంటెంట్ డిలే వంటి సమస్యల కారణంగా ‘స్పై’ చిత్రం ఇండియా వైడ్‌గా మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో విడుదల కాలేదని తెలియజేయడం బాధగా ఉంది. ఈ కారణంగానే విదేశాల్లోనూ 350 వరకు తెలుగు ప్రీమియర్ షోస్ కూడా రద్దయ్యాయి. ఏదేమైనా హిందీ, కన్నడ, తమిళం, మలయాళ ప్రేక్షకులందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను. ‘కార్తికేయ 2’ తర్వాత మా అప్‌కమింగ్ 3 చిత్రాలను అన్ని భాషల్లోనూ ఖచ్చితంగా థియేటర్లలో అనుకున్న సమయానికి విడుదల చేస్తామని హామీ ఇస్తున్నాను’ అని పేర్కొన్నారు.
అంతేకాదు తమను విశ్వసించే ప్రతి తెలుగు సినీ ప్రేమికుడికి కూడా వాగ్దానం చేస్తున్నానన్న నిఖిల్.. ఇకపై క్వాలిటీ విషయంలో రాజీపడబోమని చెప్పారు. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా సరే పూర్తిగా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఫెంటాస్టిక్ ప్రొడక్ట్‌ను మాత్రమే అందజేస్తామని తెలిపారు.
ఇక పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ‘స్పై చిత్రంలో సన్యా ఠాకూర్, అభినవ్ గోమఠం, ఆర్యన్ రాజేష్, మకరంద్ దేశ్‌పాండే, జిషు సేన్ గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకులుగా పనిచేశారు.