
Published 13 Nov 2023
మాదకద్రవ్యాల(Drugs) రవాణా(Supply)ను సీరియస్ గా తీసుకుంటున్న పోలీసులు.. పబ్ లు, క్లబ్ లతోపాటు సినీ ఇండస్ట్రీపైనే మెయిన్ ఫోకస్ పెట్టారు. సినీరంగంలోని కొందరు పెద్దల ప్రోత్సాహం వల్లే విచ్చలవిడిగా దందా సాగుతుందన్న నిర్ణయానికి వచ్చారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్(CP)గా బాధ్యతలు చేపట్టిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఈ విషయాన్నే స్పష్టంగా తెలియజేశారు. డ్రగ్స్ లేని రాష్ట్రంగా తయారు కావాలంటే వాటిపై సీరియస్ గా దృష్టి పెట్టాల్సి ఉందని అన్నారు. అటు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరోకు సీనియర్ IPS సందీప్ శాండిల్య వెళ్తున్నారు. ఇప్పటిదాకా హైదరాబాద్ CPగా ఉన్న శాండిల్య.. ఇక నార్కొటిక్ బ్యూరో బాధ్యతలు చూస్తారు. డ్రగ్స్ కేసులన్నీ చూసేది ఈ యాంటీ నార్కొటికి బ్యూరో విభాగమే. ఇలా రెండు విభాగాల కోఆర్డినేషన్ తో ఇక నుంచి డ్రగ్స్ పై కన్నేయబోతున్నారు.
ఆనాడు అతి పెద్ద కేసు
హైదరాబాద్ లో ఈ మధ్యకాలంలో మళ్లీ డ్రగ్స్ కేసులు బయటపడ్డాయి. ఆగస్టు 31న మాదాపూర్ లోని అపార్ట్ మెంట్ పై దాడి చేసి సినీ ఫైనాన్షియర్ వెంకటరత్నారెడ్డితోపాటు బాలాజీ, మురళి అనే వ్యక్తుల్ని అరెస్టు చేశారు. వాట్సాప్ కాల్స్, ఛాటింగ్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు.. కలహర్ రెడ్డి, హిటాచి సాయి, స్నార్ట్ పబ్ సూర్యపై కేసులు నమోదు చేశారు. రెగ్యులర్ గా రేవ్ పార్టీలు నిర్వహించడం, డ్రగ్స్ మీటింగ్స్ ను నార్కోటిక్ డిపార్ట్ మెంట్ గుర్తించింది. ఈ కేసులో ముగ్గురు నైజీరియన్లు అరెస్టు కాగా, సినీ హీరో నవదీప్ ను విచారణకు పిలిచారు. ED ఆఫీసులో నవదీప్ ను సుదీర్ఘంగా విచారించడంతోపాటు మరోసారి రావాల్సి ఉంటుందని చెప్పి పంపించారు. సినీ సెలెబ్రిటీలకు కెల్విన్ మస్కరెన్హాస్ అనే పెడ్లర్ మత్తు పదార్థాల్ని సరఫరా చేస్తున్నాడని గుర్తించిన పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. నవదీప్ ఇప్పటికే చాలాసార్లు పోలీసు ఏజెన్సీల విచారణకు అటెండ్ అయ్యారు.