పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తల్లి ప్రాణాలు కోల్పోయి, ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లిన ఘటన వెనుక భారీగానే తతంగం నడిచినట్లు CM ప్రసంగం బయటపెట్టింది. అల్లు అర్జున్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లడం, అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి PSకు తరలించడం, కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు పంపడం, ఆ తర్వాత హైకోర్టులో తీవ్ర వాదోపవాదనలు, చివరకు బెయిల్ పై విడుదల.. ఇవి మాత్రమే బయటకు కనిపించాయి. అరెస్టు విషయంలో అర్జున్ హుందాగా ప్రవర్తించారని, అంత పెద్ద హీరో అయినా ఎక్కడా ఇబ్బంది పెట్టలేదన్న ప్రచారం జరగడంతో ఒక రకంగా పుష్ప మూవీ హీరో కాస్తా వారెవా అనిపించుకున్నారు. కానీ CM మాట్లాడిన తర్వాత సీన్ మారిపోయింది.
హీరో, హీరోయిన్ల రాకకు పర్మిషనే లేదని, పోలీసులు వద్దని చెప్పినా థియేటర్ కు రావడం, ఇరుకైన ప్రాంతంలో కారు రూఫ్ టాప్ నుంచి అభివాదం చేయడం, దాన్ని చూసి వేలాది మంది ఒక్కసారిగా సంధ్య థియేటర్లోకి చొచ్చుకురావడం వంటి విషయాలన్నీ CM స్పీచ్ ద్వారా బయటపడ్డాయి. సినిమా చూస్తున్న అల్లు అర్జున్ కు.. తొక్కిసలాట జరిగి ఇద్దరు మృతిచెందారన్న విషయాన్ని తెలియజేసినా ఆయన థియేటర్ వదిలి వెళ్లిపోవడానికి ఇష్టపడలేదని రేవంత్ చెప్పడంతో ఈ ఘటన వెనుక ఇంత తతంగం జరిగిందా అన్న చర్చ జోరందుకుంది. ఇప్పటిదాకా అరెస్టు కోణమే చూస్తే ఇప్పుడు మాత్రం సినీ యూనిట్ ప్రవర్తించిన తీరు ఏ మాత్రం బాగా లేదన్న మాటలు వినపడుతున్నాయి. సీఎం భావోద్వేగంగా చెప్పిన తీరుతో.. ఇప్పటిదాకా చూసిన కోణంలో పూర్తిగా మార్పు కనిపించింది.