‘సూపర్ స్టార్’ రజనీకాంత్ ఇక గవర్నర్… తెలంగాణ గవర్నర్ గా త్వరలోనే బాధ్యతలు… తమిళిసై స్థానంలో రజనీ అంటూ.. సోషల్ మీడియాలో ఒకటే వార్తలు. రజనీ గవర్నర్ కాబోతున్నారంటూ ప్రచారం ఊపందుకోగా ఆయన తెలంగాణకే రానున్నారంటూ సోషల్ మీడియా ఊపేస్తున్నది. గత కొద్దిరోజులుగా ఆయన BJP పెద్దలతో టచ్ లో ఉండటంతో ఈ పదవిపై ఊహాగానాలు బయల్దేరాయి. ఇలాంటి పరిస్థితుల్లో రజనీ సోదరుడు సత్యనారాయణ ‘రజనీకి గవర్నర్ పదవి రావాలని ఆశ లేదు.. కానీ వస్తే సంతోషిస్తాం.. రజనీ కూడా గవర్నర్ పదవిని తిరస్కరించబోరు’ అంటూ మాట్లాడటంతో ఇది కాస్తా వైరల్ గా మారింది. ఇక ‘తలైవా’కు గవర్నర్ గ్యారెంటీ అన్న ప్రచారం సోషల్ మీడియా వేదికలపై ఊపందుకుంది. ‘జైలర్’ మూవీ విజయంతో హిమాలయాల సందర్శనకు వెళ్లిన రజనీ… వస్తూ వస్తూ UP CM యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ గవర్నర్ తో మీట్ అయ్యారు. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ కాళ్లకు దండం పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ సినీ ‘సూపర్ స్టార్’ సోదరుడు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
పార్టీ స్థాపించి జనాలకు చేరువ కావాలని గతంలోనే రజనీ ట్రై చేసి ఫ్యాన్స్ తో పెద్దయెత్తున సమావేశాలు పెట్టారు. కానీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా పాలిటిక్స్ లోకి రావాలన్న ఆలోచనను విరమించుకున్నానని, ఎన్నికల్లో పోటీ చేసేది లేదంటూ చెప్పారు. పాలిటిక్స్ తో సంబంధం లేకుండానే ప్రజలకు సేవ చేస్తానని ప్రకటించడంతో ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. బస్ కండక్టర్ గా పనిచేస్తూ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన రజనీ.. దక్షిణాదినే కాకుండా భారతదేశ వ్యాప్తంగా విశేష స్టార్ డమ్ సంపాదించారు. ఆయనకు జపాన్ తోపాటు పలు దేశాల్లో పెద్దసంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. ‘జైలర్’ సృష్టించిన ప్రభంజనంతో అన్ని ఇండస్ట్రీలను షేక్ చేసిన ఆయన.. ఇక తెలంగాణ గవర్నర్ ఖాయం అన్న ప్రచారం తమిళనాట బాగా జరుగుతోంది. దీనిపై ఆయన ఇప్పటిదాకా పెదవి విప్పకపోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం దొరికిందన్న మాటలూ వినపడుతున్నాయి.
గవర్నర్ తమిళిసైకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక రకంగా పరోక్ష యుద్ధమే జరిగింది. మొన్నటివరకు యంత్రాంగమంతా గవర్నర్ కు దూరంగా ఉన్నారు. కానీ సెక్రటేరియట్ లో ప్రార్థనా మందిరాల ఓపెనింగ్ నాడు గవర్నర్ కు CM సాదరంగా వెల్ కమ్ చెప్పారు. అప్పట్నుంచి ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య దూరం తగ్గినట్లేనన్న ప్రచారం నడిచింది. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో పట్టు సాధించాలని BJP భావిస్తున్న తరుణంలో రజనీకాంత్ తెలంగాణకు రాబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం… దేశ సినీ ఇండస్ట్రీతోపాటు రాజకీయాల్లోనూ సంచలనానికి కారణమవుతుంది. మరి రజనీ సోదరుడు చెప్పినట్లుగా గవర్నర్ పదవికి ‘తలైవా’ తల ఊపుతారా.. సినీ ‘స్టార్ డమ్’ పక్కనబెట్టి గవర్నర్ పదవికి సై అంటారా.. గవర్నరేనా లేక ఇంకా పెద్ద పదవి కోరుకుంటారా అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.