టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందిన రాకేష్ మాస్టర్ హఠాన్మరణం అందరినీ షాక్‌కు గురిచేసింది. తన యూట్యూబ్ ఛానల్ కోసం చేస్తున్న ఓ ప్రోగ్రామ్ షూటింగ్‌ను వైజాగ్‌లో ముగించుకుని హైదరాబాద్ తిరిగొచ్చిన ఆయన అస్వస్థతకు గురయ్యారు. స్థానిక హాస్పిటల్లో చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్ప్రతికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించారు రాకేష్ మాస్టర్. అయితే తాజాగా రాకేష్ మాస్టర్ కుమారుడు చరణ్.. తన తండ్రి మరణానికి సోషల్ మీడియానే కారణమని ఫైర్ అయ్యాడు.
‘మా నాన్నకు ఇలాంటి పరిస్థితి రావడానికి సోషల్ మీడియా ప్రధాన కారణం. అనేక యూట్యూబ్ ఛానెళ్లు మా నాన్నను తమ స్వలాభం కోసం వాడుకున్నాయి. వారు ఆయన్ని చెడుగా చిత్రీకరించారు. అలాంటి వీడియోలను ఇప్పటికైనా ఆపండి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మా కుటుంబ సమస్యల ప్రచురించకండి. ఇప్పటికే మా కుటుంబానికి చేసిన నష్టం చాలు’ అని ఆవేదన చెందాడు.
అంతేకాదు తన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడుతున్నారు? ఇలాంటి వీడియోలు చూపించడం మానేయాలని రిక్వెస్ట్ చేసిన చరణ్.. తమ జీవితాలను చీకటిలోకి లాగొద్దని.. ఎవరైనా అలా చేస్తే పోలీసులను ఆశ్రయించాల్సి ఉంటుందని హెచ్చరించాడు.