నేషనల్ క్రష్ రష్మిక మందన వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం తను టాలీవుడ్, బాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో కొన్ని రోజుల క్రితం హీరో నితిన్‌లో ఓ సినిమాకు కమిట్ అయింది రష్మిక. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. అయితే వెంకీ, నితిన్, రష్మిక కాంబినేషన్లో ఇదివరకు ‘భీష్మ’ సినిమా వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ ముగ్గురు కలిసి సినిమా చేస్తుండటంతో VNRtrio పేరుతో ఒక ప్రమోషనల్ వీడియో కూడా వదిలారు. కానీ సడెన్‌గా రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే, డేట్స్ క్లాష్ వల్లే ఇలా జరిగిందని తెలుస్తోంది.
నిజానికి రష్మిక చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలు ఉన్నాయి. దీంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతుందట. ఇదే విషయాన్ని తాజాగా మేకర్స్‌కు తెలియజేసిన కన్నడ బ్యూటీ.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే రష్మిక ప్లేస్‌లో యంగ్ హీరోయిన్ శ్రీలీలను తీసుకునే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే మహేష్ బాబు ‘గుంటూరు కారం’ నుంచి పూజా హెగ్డే తప్పుకోగా.. ఆ ప్లేస్‌లో శ్రీలీలను సెట్ చేశారు త్రివిక్రమ్. దీంతో ఇప్పుడు నితిన్ సినిమాలో రష్మిక ప్లేస్‌ను కూడా శ్రీలీలతో ఫిల్ చేయొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.