తమిళనాడు సినీ ఇండస్ట్రీ సూపర్ స్టార్, విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్ కలిగిన దళపతి విజయ్.. కొత్త రాజకీయ పార్టీ(Political Party)ని ప్రారంభించారు. ఆయన పార్టీ పెడతారని గత కొన్ని నెలలుగా పెద్దయెత్తున ప్రచారం జరుగుతుండగా, చాలా సార్లు సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ పేరును సోషల్ మీడియాలో స్వయంగా విజయ్ పంచుకున్నారు. ‘తమిళ వేట్రి కళగం’ పేరుతో పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొద్దిరోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోమని చెప్పిన విజయ్… తమ టార్గెట్ 2026 శాసనసభ(Assembly) ఎన్నికలే అని క్లారిటీ ఇచ్చారు.
రజనీకాంత్ తర్వాత…
తమిళనాట రాజకీయ పార్టీ ఉంటే అది సీనియర్ సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth)దే అయి ఉంటుందని చాలా ఏళ్ల నుంచి అభిమానులు కలలుగన్నారు. పార్టీ పెడుతున్న దశలో ఆ ప్రయత్నాన్ని రజనీ విరమించుకోవడంతో అందరిలోనూ నిరాశే కనిపించింది. కానీ రజనీ తన ఆలోచనను మార్చుకున్నప్పటి నుంచి దళపతి విజయ్ రంగంలోకి దిగారు. తమిళనాడు రాజకీయాల్ని మార్చాలన్న లక్ష్యంతో కొత్త పార్టీ పెడుతున్నట్లు హింట్ ఇచ్చారు. ఇప్పటివరకు సేవా కార్యక్రమాలకే పరిమితమైన ఈయన.. కొత్త పార్టీ పేరును ఆమోదించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాని(CEC)కి లెటర్ పంపారు.
బ్లాక్ బస్టర్ మూవీలతో…
నటుడు, సింగర్ అయిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కాస్తా తమిళనాట విజయ్ గా సుపరిచితమయ్యారు. 67 సినిమాల్లో నటించిన ఈ సూపర్ స్టార్ ను దళపతిగా అభిమానులు పిలుచుకుంటారు. ఆయన తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ తమిళ దర్శకుడు కాగా క్రిస్టియన్. విజయ్ తల్లి హిందూమతానికి చెందినవారు. ఇతడు 10 ఏళ్ల వయసులోనే ఛైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించారు. తర్వాత హీరోగా యాక్ట్ చేసిన వివిధ సినిమాలు తెలుగులోనూ బాగా ఆడాయి.
Published 02 Feb 2024