KGF చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సలార్. ఈ యాక్షన్ ఎంటర్ టెయినర్ కు సంబంధించి రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ‘సలార్(SALAAR) పార్ట్-1 సీజ్ ఫైర్’ 100 మిలియన్ల వ్యూస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ దూసుకుపోతోంది. ‘లయన్, చీతా, టైగర్, ఎలిఫెంట్… వెరీ డేంజరస్.. బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్… బికాస్ ఇన్ దట్ పార్క్ దెర్ ఈజ్ ఏ’… అంటూ టీనూ ఆనంద్ చెప్పే డైలాగ్ తో విడుదలైన టీజర్ ట్రెండ్ క్రియేట్ చేసే దిశగా సాగుతోంది. 1:46 నిమిషాల నిడివి గల ఈ వీడియోను విడుదల చేసిన మూవీ నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిల్మ్స్ తాజాగా ప్రకటన విడుదల చేసింది.
‘మా టీజర్ 100 మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తోంది… మీ ఆదరణ చూశాక అసామాన్యమైన చిత్రాన్ని అందించాలన్న లక్ష్యం మరింత బలపడింది’ ఇండియన్ సినిమా వైభవాన్ని చాటేలా ట్రైలర్ తీసుకువస్తాం… ఆగస్టు నెలను టిక్ చేసుకుని పెట్టుకోండి అంటూ.. హోంబలే ఫిల్మ్స్ ఆసక్తిని రేకెత్తించేలా నోట్ వెల్లడించింది. వరల్డ్ వైడ్ గా థియేటర్లలో ఈ మూవీ విడుదల డేట్ ను కూడా ప్రకటించింది మూవీ ప్రొడక్షన్ యూనిట్. సెప్టెంబరు 28న మీ ముందుకు వస్తోందంటూ టీజర్ లో చూపించింది.
KGF తరహాలోనే ఈ మూవీని కూడా హై రిచ్ గా తీస్తున్న ప్రశాంత్ నీల్… దీన్ని కూడా సీక్వెల్స్ గా తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ‘సలార్(SALAAR) పార్ట్-1 సీజ్ ఫైర్’ పేరు పెట్టినట్లు అర్థమవుతోంది. ఈ సినిమాలో శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.