
జంటగా ఒక్కటి కాబోతున్న బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) MP రాఘవ్ చద్దా వివాదంలో చిక్కుకున్నారు. గత మే నెలలో పెళ్లి నిశ్చయమైన తర్వాత దేవదేవుణ్ని దర్శించుకునేందుకు మధ్యప్రదేశ్ లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ కు ఈ జంట వెళ్లింది. అక్కడ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. పసుపు పచ్చ పంచెతో రాఘవ్, పింక్ శారీలో పరిణీతి పూర్తి సంప్రదాయబద్ధంగా ఆలయానికి చేరుకున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఈ జంట వ్యవహరించిన తీరుతో సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
టెంపుల్ ప్రాంగణంలో పాదరక్షలతో ఈ జంట కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఇక నెటిజన్లు ఊరుకుంటారా… ఒకటే ట్రోలింగ్స్. ‘చెప్పులు ఎవరన్నా ఎత్తుకుపోతారేమోనని టెంపుల్ ప్రెమిసెస్ లోకి తెచ్చుకున్నారా… గుడిలోకి పాదరక్షలతో పర్మిషన్ ఉండదని తెలియదా ముఖ్య నేత రాఘవ్ చద్దా, ఫేమస్ యాక్ట్రెస్ పరిణీతా… ఈ విషయంలో ఈ ఇద్దరూ చేసిన పనికి సిగ్గు పడాల్సి వస్తున్నది’ అంటూ నెటిజన్లు ట్రోలింగ్స్ తో విరుచుకుపడ్డారు.
ఆమ్ ఆద్మీ పార్టీలో రాఘవ్ చద్దా కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లోనూ BJP తీరును గట్టిగా నిలదీశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, మణిపూర్ అంశంలో దీటుగా ప్రసంగించారు. ఇక పరిణీతి చోప్రా తన నటనతో అనతికాలంలోనే ఫిల్మ్ ఫేర్ తోపాటు నేషనల్ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. తొలి చిత్రం ‘లేడీస్ వర్సెస్ రిక్కీ భాయ్’కి బెస్ట్ ఫిమేల్ డెబ్యూట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు సాధించారు. ‘ఇషాక్ జాదే’, ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘హసీ తో ఫసీ’ సినిమాల్లో పరిణీతి చోప్రా నటించింది. గత మే 13న వీరిద్దరికీ ఎంగేజ్ మెంట్ జరగ్గా.. సెప్టెంబరు 25న వివాహం జరగాల్సి ఉంది.