అభిమానుల పట్ల మరోసారి విజయ్ దేవరకొండ ఉదారత చూపించారు. ‘ఖుషి’ సినిమా ద్వారా తాను సంపాదించిన మొత్తంలో రూ.కోటిని వంద కుటుంబాలకు పంచనున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నంలో నిర్వహించిన ‘ఖుషి’ సక్సెస్ వేడుకల్లో ఆయన ఈ ప్రకటన చేశారు. డబ్బులిచ్చి మరీ తమపై వ్యతిరేక రివ్యూలు రాయిస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ‘నా మీద, నా సినిమా మీద సోషల్ మీడియా దాడి జరుగుతున్నది.. కొందరు డబ్బులిచ్చి మరీ ఫేక్ రివ్యూ రాయిస్తున్నారు.. ఫేక్ రేటింగ్స్, రివ్యూలను దాటుకుంటూ సక్సెస్ ఫుల్ గా సినిమా ఆడుతుందంటే ‘ఖుషి’ స్టోరీలో ఉన్న బలంతోపాటు అభిమానులేనని విజయ్ అన్నారు. అందుకే వారి రుణం తీర్చుకునేందుకు 100 ఫ్యామిలీలకు రూ.కోటి అందిస్తానన్నారు.
ఒక్కొక్కరినీ వ్యక్తిగతంగా కలిసి మూవీని సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది.. కానీ అది వీలు పడదు.. అందుకే వంద కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో ఫ్యామిలీకి రూ.లక్ష చొప్పున 10 రోజుల్లో అందిస్తానని మాట ఇచ్చారు. నా ఆనందం, సంపాదనను మీతో పంచుకోకపోతే వేస్ట్.. మనదంతా దేవర ఫ్యామిలీ అని విజయ్ దేవరకొండ ఆనందంతో చెప్పారు.