
దళపతి విజయ్ సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారా? అంటే కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. చాలా కాలంగా ఇలాంటి వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. ఈ మధ్య విజయ్ సోషల్ యాక్టివిటీస్ చూసిన మీదట బ్రేక్ ఇవ్వడబోతుండటం నిజమేనంటూ ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తమిళనాడులో సూపర్‌స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ స్టార్డమ్ కలిగిన స్టార్ విజయ్. అయితే రజినీ రాజకీయాల్లోకి వస్తారని అనుకున్నప్పటికీ ఆరోగ్యం, వయసు దృష్ట్యా ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఇక విజయ్ పాలిటిక్స్‌లోకి రావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్న అభిమానులు.. మార్పు తనతో సాధ్యమని నమ్ముతున్నారు.
ఇదే క్రమంలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ చేయబోయే సినిమానే చివరిదని, దాని తర్వాత ఓ మూడేళ్ల పాటు బ్రేక్ ఇస్తారని తాజా సమాచారం. ఇక ఈ టైమ్‌లో విజయ్ తన అభిమానులను కార్యకర్తలుగా మార్చడం ద్వారా తను ప్రారంభించబోయే రాజకీయ పార్టీని రూట్ లెవెల్ నుంచి డెవలప్ చేయడంపై దృష్టిసారిస్తారని తెలుస్తోంది. అయితే నిజంగానే విజయ్ సొంతంగా పార్టీని ప్రారంభిస్తారా లేదా తమిళనాడులో ఉన్న ఏదైనా రాజకీయ పార్టీలో చేరతారా అనే సస్పెన్స్ 2024లోగా క్లియర్ అయ్యే అవకాశం ఉంది.