
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లో అడుగుపెడతారని దాదాపు దశాబ్ద కాలంగా వినబడుతోంది. కానీ ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నారు. అయితే, తాజా పరిణామాలు మాత్రం ఆ సమయం ఆసన్నమైందని వెల్లడిస్తున్నాయి. వెంకట్ ప్రభుతో చేయబోయే Thalapathy68 తర్వాత తను సినిమాలకు బ్రేక్ ఇస్తారని ఇప్పటికే మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయ్ తన పొలిటికల్ ఎంట్రీ గురించి చర్చించడానికి చెన్నైలో వందలాది మంది అభిమానులతో పాటు అతని అభిమానుల సంఘం విజయ్ మక్కల్ ఇయక్కం సభ్యులతో సమావేశమైనట్లు సమాచారం.
ఫుల్ టైమ్ పాలిటిక్స్‌లో కొనసాగడం కోసం తాను సినిమాల నుంచి తప్పుకోబోతున్నట్లు విజయ్ ఈ మీటింగ్ సందర్భంగా అభిమానులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన పొలిటికల్ జర్నీకి సంబంధించిన రోడ్‌మ్యాప్‌పై చర్చించినట్లుగా న్యూస్ వినపిస్తోంది. ఈ మేరకు గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయిందని.. పార్టీ, క్యాడర్ నిర్మాణం కోసం తాము ఎదురుచూస్తున్నామని విజయ్ అభిమానులు మీడియాకు తెలిపారు. అంతేకాదు ప్రముఖ తమిళ స్టార్లు రజనీకాంత్, అజిత్ కుమార్ ఫ్యాన్స్ మద్దతు కూడా తమకు ఉందని ఈ సందర్భంగా విజయ్ ఫ్యాన్స్ చెప్పారు. కాగా.. విజయ్ ఇటీవలే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లియో’ చిత్రానికి సంబంధించి తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నాడు.