దేశ రాజధాని(National Capital) హస్తిన గరం గరంగా మారింది. రైతులు తలపెట్టిన ఛలో ఢిల్లీ ఉద్యమం.. ఉద్రిక్తతలకు దారితీసింది. వేల సంఖ్యలో తరలివచ్చిన ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయు గోళాల్ని(Tear Gas) ప్రయోగించారు(Fired). ఉదయం 10 గంటలకు పంజాబ్ లోని ఫతేగఢ్ సాహిబ్ నుంచి పెద్దసంఖ్యలో రైతులు.. ట్రాక్టర్లతో హస్తినకు బయల్దేరారు. అటు సంగ్రూర్ నుంచి సైతం చాలామంది ఢిల్లీ వైపునకు తరలారు. కేంద్రంతో చర్చల కోసమే ఈ విధానాన్ని ఎంచుకున్నామంటూ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ సెక్రటరీ శర్వణ్ సింగ్ పంధేర్ అంటున్నారు. అయితే రైతుల మూకుమ్మడి ఆందోళనతో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ సరిహద్దులు(Borders) రణరంగాన్ని తలపిస్తున్నాయి.
హైవేపై ట్రాఫిక్ జామ్…
పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడంతోపాటు చట్టం చేయడం.. 2020 జరిగిన ఆందోళనల్లో పెట్టిన కేసుల్ని కొట్టివేయడం వంటి డిమాండ్లతో రైతులు ఛలో ఢిల్లీకి పయనమయ్యారు. పంజాబ్, హరియాణా సరిహద్దు అయి శింభూలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బారికేడ్లు, బలగాల పహారాను దాటుకుంటూ ముందుకు కదలడంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్(Traffic Jam) కావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైతుల ఆందోళన దృష్ట్యా రెండ్రోజుల నుంచే కేంద్ర బలగాలు ఢిల్లీ పరిసరాల్లో పహారా కాస్తున్నాయి. డ్రోన్లతో పరిస్థితుల్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి.
ఢిల్లీ-యూపీ సరిహద్దు ప్రాంతంలో…
ఢిల్లీకి పశ్చిమ ఉత్తరప్రదేశ్ ను కలిపే ఘాజీపూర్ ప్రాంతంలో భద్రతను భారీగా మోహరించారు. హరియాణాలోని అంబాలా నుంచి పెద్దసంఖ్యలో రావడంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా తయారైంది. ఛలో ఢిల్లీ మార్చ్ కోసం ఆరు నెలల పాటు దేశ రాజధానిలోనే ఉండేందుకు నిత్యావసరాలతో బయల్దేరారు. ఎం.ఎస్.స్వామినాథన్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా రుణమాఫీ అమలు చేయాలని కూడా నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆందోళనకు కారణమైన లఖీంఫూర్ ఖేరీ ఘటనలో మృత్యువాతపడ్డ వారికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలంటున్నారు. ఈ డిమాండ్లన్నీ అమలు చేసేవరకు ఢిల్లీని అష్టదిగ్బంధనం చేస్తామంటున్నారు.