Published 11 Dec 2023
ఇష్టమొచ్చినట్లుగా తప్పుడు వార్తలు, మెసేజ్(Wrong News, Messages) లను వచ్చినవి వచ్చినట్లుగా ఫార్వార్డ్ చేస్తే ఇక నుంచి ఇబ్బందులు తప్పేలా లేవు. రానున్న రోజుల్లో ఇలాంటి మెసేజ్ లపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఒకవేళ నేరం రుజువైతే మూడేళ్ల శిక్ష పడే అవకాశమూ ఉంది. అరచేతిలో ఫోన్ ఉంది కదా అని నిజమా, కాదా అని తెలుసుకోకుండా తప్పుడు వార్తలను ప్రచారం చేయడం ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయింది. మొన్నటి ఎన్నికల సమయంలో కొందరిని టార్గెట్ చేసుకుంటూ ఈయన అలాంటోడు, ఆయన ఇలాంటోడంటూ గందరగోళం సృష్టించారు. కొన్నిసార్లు కొంతమంది నాయకులపై దారుణమైన మెసేజ్ లు పంపిచారు. దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతుండటంతో వాటిని కట్టడి చేసేందుకు పోలీసులు దృష్టి పెట్టారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) ప్రకారం గతేడాది పెద్దయెత్తున నకిలీ వార్తలు ప్రచారమయ్యాయి.
డీప్ ఫేక్ టెక్నాలజీపైనా కన్ను
ముఖాల్ని మార్చి అసభ్యకర వీడియోలతో ఇబ్బందులకు కారణమవుతున్న డీప్ ఫేక్ వీడియోలపైనా కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ మధ్యకాలంలో పలువురు హీరోయిన్ల ఫేస్ మార్ఫింగ్ తో వచ్చిన డీప్ ఫేక్ వీడియోలు కలకలానికి కారణమయ్యాయి. దీనిపై కేంద్ర IT, టెలీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించారు. డీప్ ఫేక్ వీడియోల టెక్నాలజీని వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా నకిలీ మెసేజ్ లు, డీప్ ఫేక్ వార్తలు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడుతుంది.