సైబర్ క్రైమ్… గతంలో కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన ఈ పదం ఇంటర్నెట్ విస్తృతితో పల్లెపల్లెకూ చేరిపోయింది. అరచేతిలో మొబైల్ అస్త్రం అని మనం భావిస్తే.. అది నేరగాళ్లకు మంత్రదండంగా మారిపోయింది. ఇంట్లోకి వచ్చి, బెదిరించి దోపిడీలు జరిగేవి గతంలో. కానీ ఆనవాళ్లు లేకుండానే.. ఎక్కడుంటాడో తెలియకుండానే సొమ్మంతా దోచుకుపోతున్నాడు. వీటన్నింటికీ ప్రధాన కారణం మొబైల్ ఫోన్.
అంతా.. ఆన్లైన్(Online) మాయ
ఆన్లైన్(online) సేల్స్ ఎంతగా పెరుగుతున్నాయో సైబర్ మోసాలు అంతే రెట్టింపవుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో భారీగా మోసాలు జరిగేవి. కానీ ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ రకరకాల మోసాల బారిన పడుతూ ప్రజలు డబ్బు పోగొట్టుకుంటున్నారు. పోలీసుల లెక్కల ప్రకారం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనే ఏటా రూ.500 కోట్ల మోసాలు జరుగుతున్నాయి. కానీ ఇది అంతకు రెండు రెట్లు ఉంటుందని స్పష్టమవుతుంది. కేసులకు ముందు రాని వారు వేలల్లో ఉంటారని నిపుణులు అంటున్నారు. 2018లో 1208 కేసులుంటే 2022కు వచ్చే సరికి వెయ్యి రెట్లు పెరిగి 12 వేల వరకు చేరుకున్నాయి.
మోసాలలో రకాలు
ఒకప్పుడు ఒకట్రెండు అంశాలకే పరిమితమైన సైబర్ నేరాలు 20 రకాల మోసాలకు చేరుకున్నాయి. ఓటీపీ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్, ఇన్ స్టా లోన్స్, నైజీరియన్ ఫ్రాడ్స్, ఓఎల్ఎక్స్ ఫండ్స్, బ్యాంకు అకౌంట్స్, సోషల్ మీడియా, లాటరీ కార్డ్స్, అప్ డేట్స్(updates) పేరిట దోపిడీలకు పాల్పడుతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ల వాడకం బాగా పెరిగిన తర్వాత మోసాలు పెద్దసంఖ్యలో జరుగుతున్నాయి. ఒక యాప్ ద్వారా 1.70 కోట్లు పోగొట్టుకున్న ఘటన హైదరాబాద్ లో జరిగింది. బాగా చదువుకున్న ఆ వ్యక్తి ఆన్ లైన్ ద్వారా మహిళతో చాటింగ్ చేయాలని చూశాడు. మిమ్మల్ని కలవాలంటే డబ్బులు పంపాలన్న ఆన్సర్ వచ్చింది. అలా రెండేళ్లుగా అమ్మాయి అనుకుని కోటీ 70 లక్షలు సమర్పించుకుని చివరకు పోలీసుల వద్దకు చేరాడు. ఇక బ్యాంకు KYC అప్డేట్ చేయాలంటూ వచ్చిన కాల్ తో మరో వ్యక్తి రూ.4 లక్షలు పోగొట్టుకున్నాడు. ఎదుటి వ్యక్తి చెప్పిన విధంగా డేటా ఎంటర్ చేశాడు. చివరకు అకౌంట్లో ఉన్న 4 లక్షలు పోయాక కేసు పెట్టాడు.
వెలుగులోకి రానివి వేలల్లో.. రికవరీలో మనమే టాప్
రాష్ట్ర రాజధానిలోని 3 కమిషనరేట్ల పరిధిలో వేల కేసులు రికార్డరవుతున్నాయి. హైదరాబాద్ లో 2019లో 1,393, 2020లో 2,050.. 2021లో 2,020.. 2022లో 2.500 కేసులు రికార్డయ్యాయి. సైబరాబాద్ లో 2020లో 1,212, 2021లో 512, 2022లో 1,000 కేసుల దాకా బుక్ అయ్యాయి. తెలంగాణలో ఈ రెండేళ్లలో 2,64,000 మంది బాధితులు కాగా.. 1,27,000 మంది కంప్లయింట్ ఇచ్చారు. మొత్తంగా రూ.587 కోట్లు కోల్పోగా, రూ.12 లక్షల్ని మాత్రమే రికవరీ చేశారు. రికవరీలో దేశంలోనే మనం టాప్ లో ఉన్నట్లు NCRB తెలిపింది. యూపీ, కర్నాటక, మహారాష్ట్ర తర్వాత మన నుంచే ఎక్కువగా సైబర్ నేరగాళ్ల పాలవుతున్నది. కేసుల్లో ఓటీపీ ఫ్రాడ్స్ పెద్దయెత్తున ఉంటున్నాయని సైబర్ క్రైం విభాగం అంటున్నది. అధికారిక లెక్కలే ఇలా ఉంటే పోలీసుల ముందుకు రానిని వేలల్లో ఉంటున్నాయి. పోలీసుల వద్దకు వెళ్తే ఏమవుతుందోనన్న భయం ప్రజల్లో కనిపిస్తున్నది. దీన్ని బట్టి చిన్నాచితకా కేసుల సంఖ్య ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
టెన్త్, ఇంటర్ తోనే ఎక్స్ పర్ట్స్(experts)
జార్ఖండ్, పశ్చిమ్ బెంగాల్ కు చెందినవారే ఈ నేరాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిపై దాడులకు టీమ్ లు వెళ్తున్నా పెద్దగా ఫలితం ఉండట్లేదని సైబర్ క్రైం ఏసీపీ స్థాయి ఆఫీసర్ చెబుతున్నారు. జార్ఖండ్‌లోని జామ్ తారా, నారాయణపూర్, కుర్వ, కరంఠాండ్, ధన్ బాద్, దేవ్ బాద్… పశ్చిమ్ బెంగాల్ లోని అసన్ సోల్, దుర్గాపూర్ జిల్లాలకు చెందిన వ్యక్తులు నేరాలకు చేస్తున్నారు. ఈ ప్రాంతాలు రెండు రాష్ట్రాలకు బార్డర్స్ గా ఉండటంతో ఒకర్ని చూసి ఒకరు ఈ లాబీలోకి వెళ్తున్నారు. తండాలు, చిన్న ఊర్ల మాదిరి ప్రాంతాల్లో ఇంట్లోనే ఉండి సైబర్ నేరాలు చేస్తున్నట్లు తేల్చారు. ల్యాప్ టాప్, మొబైల్, సిమ్ కార్డులు ఉపయోగించి యువకులే నేరాలకు పాల్పడుతున్నారు. వీరు చదివింది టెన్త్, ఇంటరే అయినా విచ్చలవిడి సిమ్ కార్డుల ద్వారా బురిడీ కొట్టిస్తున్నారు.
స్వీయ జాగ్రత్తలే శ్రీరామరక్ష
ఒకప్పుడు ఫోన్ నుంచి కాల్ వస్తే, పోతే చాలన్నట్లుండే. కానీ ఇప్పుడన్నీ మొబైల్ లోనే. ఫోన్ ను ఎంత వాడాలో అంతే వాడితే మంచిదని, వచ్చిన ప్రతి మెసేజ్ కు, కాల్ కు రెస్పాండ్ కావొద్దంటోంది సైబర్ విభాగం. ఫ్రీ మొబైల్ రీఛార్జ్ అంటూ వాట్సాప్ కు లింక్ పంపిస్తున్నారు. క్లిక్ చేయగానే మాల్ వేర్ సైట్లకు వెళ్లడం ద్వారా సమాచారం నేరగాళ్ల పాలవుతున్నది. చాలామంది ఈ లింకుల్ని క్లిక్ చేయడమే కాకుండా వాటిని ఫార్వార్డ్ చేస్తుండటంతో తెలిసినవాళ్లే పంపారులే అని క్లిక్ చేస్తే ఇక అంతే సంగతులు. ఇలాంటి లింకుల్ని క్లిక్, ఫార్వార్డ్ చేయకుండా వెంటనే డిలీట్ చేయాలి. ఆన్ లైన్ యాప్స్ బ్యాంకులకు టచ్ అయి ఉండటంతో వివరాలు తెలిసిందో సొమ్మంతా గోవిందా అవుతోంది. నాలుగేళ్ల క్రితం సాఫ్ట్ వేర్ ఉద్యోగులే ఎక్కువగా వీటి బారిన పడేవారు. అత్యాశకు పోయి నేరగాళ్లకు చిక్కేవారు. కానీ ఇప్పుడు వీరు, వారు అనే తేడా లేకుండా అందరూ బాధితులవుతున్నారు. స్వీయ జాగ్రత్తలు తీసుకుంటేనే డబ్బుకు శ్రీరామరక్ష అంటున్నారు సైబర్ నిపుణులు.