ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ BRS MLC కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ పై ఆమెకు ఊరట దక్కలేదు. మనీలాండరింగ్ కేసులో బెయిల్ ఇవ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం(Top Court) అందుకోసం కింది కోర్టుకే వెళ్లాలని సూచించింది. ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచిస్తూ పిటిషన్ లోని అంశాలపై EDకి నోటీసులు జారీ చేస్తామని తెలిపింది. ‘ఇది అందరికీ ఒకే రకంగా అమలు చేయాల్సిన విధానం.. బెయిల్ కోసం నేరుగా అపెక్స్ కోర్టుకు రావొద్దు.. పొలిటికల్ పర్సన్ లేదా ఎవరైనా నేరుగా(Direct) ఇక్కడకు రావొద్దు..’ అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది.
ట్రయల్ కోర్టుకు…
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ఉందని చెప్పిన ధర్మాసనం.. పిటిషన్ లోని మిగతా అంశాల జోలికి వెళ్లదలచుకోలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు నోటీసులు జారీ చేసింది. బెయిల్ పిటిషన్ పై జాప్యం లేకుండా విచారణ జరపాలంటూ అటు ట్రయల్ కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. రాజ్యాంగబద్ధతకు సంబంధించిన అంశాలను కవిత ప్రస్తావించడంతోపాటు తన అరెస్టు విషయంలో జరిపిన సోదాలు, ఆస్తుల అటాచ్ మెంట్ వంటివి సరికాదంటూ వివరించారు. అరెస్టు చట్టబద్ధం కానందున బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు.
అక్కణ్నుంచే రావాలి…
బెయిల్ ప్రక్రియ(Procedure) విషయం ముందుగా ట్రయల్ కోర్టు నుంచే మొదలు కావాలని, అక్కడ కాదంటే హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం బెంచ్ సూచించింది. హైకోర్టులో నిరాకరిస్తే(Reject)నే సుప్రీంకు రావాలని స్పష్టం చేసింది. ఇది బెయిల్ విషయంలో అనుసరించాల్సిన విధానం అని చెబుతూ… నేరుగా సర్వోన్నత న్యాయస్థానానికి రాకూడదంటూ కవిత లాయర్లకు గుర్తుచేసింది. రాజ్యాంగబద్ధత కలిగిన అంశాల ప్రస్తావనపైనా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన త్రిసభ్య బెంచ్ క్లారిటీ ఇచ్చింది.
కింది కోర్టులపై కపిల్…
గతంలోనూ ఇదే తరహా పిటిషన్లు తమ వద్దకు వచ్చాయన్న బెంచ్.. పీఎంఎల్ఏ(Prevention Of Money Laundering Act)ను ఛాలెంజ్ చేస్తూ గతంలో విజయ్ మదన్ లాల్ వేసిన కేసుకు కవిత పిటిషన్ ట్యాగ్ చేస్తూ వీటిపై ఆరు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు నోటీసులు పంపింది. అయితే ట్రయల్ కోర్టుల తీరు, అక్కడ జరిగే జాప్యంపై సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్… ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ముగ్గురు సభ్యుల బెంచ్… జాప్యం లేకుండా విచారణ జరపాలంటూ ట్రయల్ కోర్టును ఆదేశించింది.