కోట్లాది మంది తరలివస్తున్న ‘మహాకుంభమేళా’ను మరింత పొడిగించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే 50 కోట్ల మంది పుణ్యస్నానాలు(Amrit Snan) ఆచరించిన ఈ వేడుక.. ఈనెల 26తో ముగుస్తుంది. జనవరి 13న మొదలై 45 రోజుల పాటు సాగనుంది. ఇంకా జనం భారీగా వస్తున్నందున ‘మహాకుంభమేళా’ను 75 రోజులు నిర్వహించాలని సమాజ్ వాదీ పార్టీ(SP) చీఫ్ అఖిలేశ్ యాదవ్ అంటున్నారు. గతంలో ‘కుంభమేళా’, ‘మహాకుంభమేళా’ల్ని 75 రోజుల పాటు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. ‘విమానాలు, రైళ్లు, రోడ్లు కిక్కిరిసిపోతున్న పరిస్థితుల్లో ఇంకా చాలా మంది రావాల్సి ఉందని అర్థమవుతుంది.. ఈ వారంలోనే వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.. ప్రయాగరాజ్ రైల్వేస్టేషన్ మూసివేశారు..’ అంటూ భక్తుల రాక గురించి మాట్లాడారు. శుక్రవారం సాయంత్రానికే 50 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యోగి ప్రభుత్వం తెలిపింది. అమెరికా, రష్యా నుంచి సైతం భారీగా తరలివచ్చారు.