ప్రఖ్యాత క్షేత్రమైన గురువాయూర్(Guruvayur) శ్రీకృష్ణ ఆలయంలో రీల్స్ చేయడం వివాదానికి దారితీసింది. హిందూయేతర మహిళ గుడి కోనేటిలో కాళ్లు పెట్టి రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కేరళ గురువాయురప్పన్ టెంపుల్ ప్రపంచవ్యాప్తంగా ప్రాశస్త్యం పొందింది. అలాంటి గుడిలోకి ప్రవేశించిన బిగ్ బాస్ మలయాళం కంటెస్టెంట్, ఇన్ ఫ్లూయెన్సర్ జాస్మిన్ జాఫర్.. అక్కడే వీడియోలు తీసుకుంది. దీనిపై గురువాయూర్ దేవస్వం బోర్డు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అన్యమతస్థురాలి ప్రవేశం వల్ల ఆలయ పవిత్రత దెబ్బతిందంటూ ఆరు రోజుల పాటు శుద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. 18 రకాల పూజలు చేస్తున్నందున దర్శన సమయాల్ని తగ్గించారు. జరిగిన ఘటనపై బహిరంగ క్షమాపణలు చెబుతున్నట్లు జాస్మిన్ జాఫర్ ప్రకటన విడుదల చేసింది.