ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ ప్రసాదం పంపిణీ చేస్తున్నామన్న ప్రచారంతో చిలుకూరి బాలాజీ ఆలయం(Balaji Temple) భక్తులతో పోటెత్తింది. సంతానం లేని దంపతులకు బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రసాదం పంపిణీని మొదలుపెట్టారు. ఈ ప్రసాదాన్ని అందుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చిలుకూరు(Chilukuru)కు భారీగా జనం బయల్దేరారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు దారిలో భారీస్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది.
30 వేల మందికి…
ఈ గరుడ ప్రసాదాన్ని 30 వేల మందికి ఆలయ నిర్వాహకులు అందించగలిగారు. ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని ప్రధాన అర్చకుడు రంగరాజన్ ప్రకటించడంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో తెల్లవారుజామున 4 గంటల నుంచే కార్లు, ఇతర వాహనాల్లో(Vehicles) భక్తుల రాక మొదలైంది. ఆ రూట్లో(Route)లో 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈ పరిణామంతో భక్తులంతా వాహనాలు దిగి నడుచుకుంటూనే ఆలయానికి వెళ్లారు.
ఈ మార్గాల్లో…
ఔటర్ రింగ్ రోడ్డు(ORR), పోలీసు అకాడమీ, చిలుకూరు చౌరస్తా నుంచి చేవెళ్ల, వికారాబాద్(Vikarabad) మార్గంలో ఆలయం వరకు భారీగా వెహికిల్స్ నిలిచిపోయాయి. సరిచేసేందుకు ట్రాఫిక్ పోలీసులు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగినా పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. చివరకు అధికారులు జోక్యం చేసుకుని ప్రసాదం పంపిణీని ఆపివేయించారు.