మహాకుంభమేళాకు భక్తజనం(Pilgrims) పోటెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లోని గంగ, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. గురువారం(జనవరి 23) మధ్యాహ్నం 12 గంటలకు 10 కోట్ల మంది సందర్శించినట్లు UP సర్కారు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి మొదలైన వేడుకలు ఫిబ్రవరి 26 వరకు జరుగుతాయి. నిత్యం(Daily) లక్షల్లో భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తే.. అది కోటి దాటడంతో యంత్రాంగం ఆశ్చర్యపోతూనే అప్రమత్తమైంది. మొత్తంగా 45 కోట్ల మంది ఈ మహాకుంభమేళాకు హాజరవుతారని యోగి ఆదిత్యనాథ్ సర్కారు భావించింది. గురువారం పొద్దున్నుంచి పగలు 12 గంటల వరకే 30 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు.
మకర సంక్రాంతి సమయంలో 3.5 కోట్ల మంది, పౌష్ పూర్ణిమ సందర్భంగా 1.7 కోట్ల మంది ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. ముఖ్యమైన సందర్భాల్లో స్కూళ్లు, కార్యాలయాలు, వ్యాపారాలపై ఆంక్షలు విధిస్తూ సాధారణ రోజుల్లో మినహాయింపునిస్తోంది UP సర్కారు. రోజుకు కోటి మంది వరకు దర్శించుకున్నా రద్దీ, తొక్కిసలాటలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు చర్యలు తీసుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) సహాయంతో ఉప్రగ్రహాలు, రాడార్ శాట్ ఆధారంగా ఎప్పటికప్పుడు ఫొటోలు తీస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.