మహాకుంభమేళా(Maha Kumbh Mela) పుణ్యస్నానాలకు వచ్చే భక్తులతో ప్రయాగ్ రాజ్ కిక్కిరిసిపోయింది. ఇసుకవేస్తే రాలనంత జనంతో నదీతీరం జనసంద్రంగా మారిపోయింది. రేపు(బుధవారం) మౌనీ అమావాస్య కావడంతో ఒకరోజు ముందుగానే ప్రయాగ్ రాజ్(Prayagraj) త్రివేణి సంగమానికి కోట్ల మంది చేరుకున్నారు. ఈ ఒక్కరోజే(మంగళవారం) మధ్యాహ్నం దాకా 2.39 కోట్ల మంది పుణ్యస్నానాలు(Holy Dip) ఆచరించగా, ఈ రెండు వారాల్లో 15 కోట్ల మంది విచ్చేశారు. ఈనెల 13న మొదలైన వేడుకలు 45 రోజుల పాటు ఫిబ్రవరి 26 వరకు జరుగుతాయి. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ వేడుకలకు UP సర్కారు ఊహించని స్థాయిలో ఏర్పాట్లు చేసింది. 45 రోజుల్లో 45 కోట్ల మంది వస్తారని అంచనా వేయగా, ఈ 15 రోజుల్లోనే ఆ సంఖ్య 15 కోట్ల మందికి చేరుకుంది.
రేపు మౌనీ అమావాస్య కాగా, ఫిబ్రవరి 3న వసంత పంచమి, అదే నెల 12న మాఘ పౌర్ణమి, ఇక చివరి రోజైన ఫిబ్రవరి 26న మహాశివరాత్రి స్నానాలు ఉంటాయి. ఈ నాలుగు రోజుల్లోనే కోట్లాది మంది భక్తులు రానున్నారు. ఇంతమంది రాక దృష్ట్యా ప్రయాగ్ రాజ్ జంక్షన్, నైనీ జంక్షన్, చివోకి జంక్షన్, సుబేదార్ గంజ్ స్టేషన్ ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ ఏర్పాటు చేశారు.