అనుకోకుండా ఆలయ హుండీలో పడిపోయిందో ఐఫోన్. ఆ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి ఆలయ(Temple) అధికారుల్ని సంప్రదిస్తే అలా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా తిరుపోరూర్ లోని శ్రీకందస్వామి ఆలయంలో.. దినేశ్ అనే వ్యక్తి ఫోన్ జారవిడుచుకున్నాడు. అక్కడి సిబ్బంది అతడి అభ్యర్థన(Request)ను కాదన్నారు. ఆలయ ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం హుండీల్లోకి వచ్చిన ఏ వస్తువునైనా నైవేద్యంగా భావించి టెంపుల్ ఖజానాకు ముట్టజెపుతారు. 1975 హిందూ నిబంధనల ప్రకారం ఆ ఫోన్ తిరిగి ఇవ్వలేం అంటూ అటువైపు నుంచి జవాబు వచ్చింది. హుండీలో వేసిన వస్తువులు దేవుడి ఖాతాలోనివే కాబట్టి తిరిగి ఇచ్చేయడానికి వీలు లేదని హిందూ ధర్మాదాయ శాఖ మంత్రి పి.కె.శేఖర్ బాబు సైతం స్పష్టం చేశారు. అయితే అధికారులతో చర్చిస్తే భక్తుడికి నష్టపరిహారం ఇచ్చేందుకు సిద్ధమన్నారు.
సరిగ్గా ఇలాంటి ఘటనే గతంలోనూ తమిళనాడులో జరిగింది. కేరళలోని అలప్పుజకు చెందిన ఎస్.సంగీత అనే భక్తురాలు.. పళనిలోని శ్రీదండాయుతపాణి స్వామి ఆలయాన్ని 2023లో సందర్శించారు. స్వామి వారిని దర్శించుకుని నైవేద్యంగా సమర్పించేందుకు ఆమె మెడలోని తులసీ మాలను తీస్తుండగా బంగారు గొలుసు హుండీలో పడింది. ఆమె ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకున్న టెంపుల్ సిబ్బంది.. అది అనుకోకుండా చేజారిందని CCTV ఫుటేజ్ లో గుర్తించారు. కానీ ఆ పాత చైన్ కు బదులు కొత్త బంగారు చైన్ ను ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ తన సొంత ఖర్చులతో చేయించి ఆమెకు అందజేశారు.