కైలాస మానస సరోవర్(Kailash Mansarover) యాత్రపై భారత్-చైనా కీలక నిర్ణయం తీసుకున్నాయి. చైనా రాజధాని బీజింగ్ లో జరిగిన విదేశాంగ శాఖల సమావేశంలో.. ఈ యాత్రపై చర్చ జరిగింది. వేసవిలో మొదలయ్యే మానస సరోవర్ యాత్రకు నేరుగా విమానాలు(Direct Flights) నడిపేందుకు రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గత అక్టోబరులో కజాన్ లో భేటీ అయిన తర్వాత విదేశాంగ శాఖలు ఈ యాత్రపై దృష్టిసారించాయి. టిబెట్ పరిధిలోని కైలాస పర్వతం, సరస్సు అయిన మానస సరోవరంను భక్తులు సందర్శించేందుకు ఇది పెద్ద ముందడుగు. కొవిడ్ వల్ల యాత్ర 2020లో నిలిచిపోగా, ఐదేళ్ల తర్వాత మళ్లీ దారులు తెరచుకోబోతున్నాయి. కరోనా మహమ్మారి ముగిశాక చర్చలు ఫలిస్తాయని అనుకుంటున్న టైంలో.. గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల ఘర్షణతో అది నిలిచిపోయింది. కానీ ఈ రెండ్రోజుల బీజింగ్ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, అంతర్జాతీయ వ్యవహారాల మంత్రి లియు జియాన్ చావో చర్చలు జరిపారు. మానస సరోవర్ యాత్రపై అంగీకారం కుదరగా, డైరెక్ట్ ఫ్లైట్స్ కు సంబంధించి త్వరలోనే ఇరుదేశాలు గైడ్ లైన్స్ రూపొందిస్తాయి.