మహాజాతరతో మేడారం(Medaram Jathara) వనం కాస్తా ఇసుక వేస్తే రాలనంత జనంగా మారిపోయింది. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరుకోవడంతో.. ఆ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు ముందుగానే భారీ సంఖ్యలో భక్తులు(Pilgrims) అక్కడకు చేరుకున్నారు. వేడుకల్లో భాగంగా తొలి రోజు నాడు కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు ఘన స్వాగతంతో తోడ్కొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించడంతో భక్తుల నినాదాలు మేడారాన్ని హోరెత్తించాయి.
కన్నెపల్లిలో రహస్య పూజలు నిర్వహించిన అనంతరం రాత్రికి సారలమ్మ ప్రతిరూపమైన మొంటెతో పూజారులు మేడారం బయల్దేరారు. అమ్మవారిని ఆ సమయంలో దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కుగ్రామమైన మేడారం కాస్తా మహానగరాన్ని మించి పోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు పరిసర రాష్ట్రాల నుంచి మేడారానికి లక్షల సంఖ్యలో జనం చేరుకున్నారు.
సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక…
మేడారం జాతరను సాంస్కృతిక వారసత్వానికి ప్రతిరూపమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇది.. సంస్కృతి, సంప్రదాయాల వారసత్వాన్ని ఈ వేడుకలు కొనసాగిస్తున్నాయి అంటూ మోదీ ‘X’లో ట్వీట్ చేశారు.