నూతన సంవత్సర వేడుకలంటే పార్టీలు, డ్యాన్సులు, రోడ్ల మీద హంగామా… అర్థరాత్రి 12 వరకు హడావుడి, ఆ తర్వాత శుభాకాంక్షలతో సందడి. ఇక మద్యం, మాంసం విక్రయాలకు కొదువే ఉండకపోయేది. కానీ ఈసారి పూర్తి మార్పు చూడగా, గతంలో జరిగిన వేడుకల మాదిరిగా ఆ స్థాయి హడావుడి ఇప్పుడెక్కడా కనిపించలేదు. ప్రజల్లో వచ్చిన ఆలోచనా ధోరణికి ఇది నిదర్శనమని పలువురు అనుకుంటున్నారు. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని పాటించాలన్న పద్ధతిలో ఆంగ్ల నూతన సంవత్సరాదిని పెద్దగా పట్టించుకోలేదు. సోషల్ మీడియా ద్వారా కలిగిన చైతన్యం(Awareness) చాలా మంది దృక్పథాన్ని(Mindset) మార్చింది. గతేడాది వరకు పార్టీలంటూ హడావుడి చేసిన ఫ్రెండ్స్ గ్యాంగులు ఈసారి దానికి దూరంగా ఉన్నాయి. రాత్రి పదిన్నరకే ఎవరింటికి వారు వెళ్లి హాయిగా నిద్రపోయారు.
బ్రిటిష్ వాళ్లు తెచ్చిన ఈ పద్ధతిని తామెందుకు పాటించాలన్న ఆలోచనతో అవసరమైతే జనవరి 1న అందరం కలుద్దాం కానీ, 31 నాడు మాత్రం పార్టీలు చేసుకోవద్దన్న భావన కనిపించింది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది కాబట్టి మనం దీనికి పెద్దగా ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం లేదన్న నిర్ణయానికి చాలా మంది వచ్చారు. అందుకే ఈ సారి న్యూఇయర్ వేడుకల్లో పెద్దగా సందడి కనిపించలేదు. అటు లిక్కర్ సేల్స్ కూడా 31 నాడు తగ్గిపోవడానికి కూడా ఇవే కారణాలు కనిపిస్తున్నాయి.