ఆకాశమంత పందిరి… భూదేవంత లోగిలి… కళ్యాణం కనులకు రమణీయం అన్న రీతిలో భద్రాచలం(Bhadrachalam) శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణ వేడుక అంగరంగ వైభగంగా సాగింది. భక్తజనుల కోలాహలంతో పట్టణమంతా రామనామంతో శోభిల్లింది. మిథిలా ప్రాంగణంలో జరిగిన వేడుకను ప్రత్యక్ష ప్రసారం(Live) చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతినిచ్చింది.
స్వామి అమ్మవార్లను…
తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం తెల్లవారుజామునే ఆలయ ద్వారాలు తెరిచి రామయ్యకు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళశాసనం, అభిషేకం తర్వాత కళ్యాణమూర్తులను పల్లకీలో ఉంచి మంగళ వాయిద్యాల నడుమ మిథిలా మైదానంలోని మండపానికి వేంచేపు చేశారు. రజత సింహాసనంపై శ్రీసీతారామచంద్రస్వామి, అమ్మవార్లను ఆసీనులు చేసి తిరువారాధన, విష్వక్సేన పూజ, పుణ్యాహవచం జరిపారు. భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకం, కలికితురాయి, రామ మాడ తదితర ఆభరణాలను ఉత్సవమూర్తులకు అలంకరించారు.
అభిజిత్ లగ్నంలో…
అభిజిత్ లగ్న ముహూర్తంలో నిర్వహించే కళ్యాణ క్రతువుకు ముందు సీతారాములకు జీలకర్ర బెల్లాన్ని తలపై ఉంచే వేడుకను పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సుముహూర్త వేడుకలో కళ్యాణాన్ని(Seetharamula Kalyanam) అంగరంగ వైభవంగా జరిపారు. ఈ వేడుకకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను చీఫ్ సెక్రటరీ(CS) శాంతికుమారి దంపతులు సమర్పించారు. ఎన్నికల కోడ్ ఉన్నందున CS వాటిని అందజేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు, కూలర్లు, తాగేందుకు మజ్జిగ వంటి వాటిని భక్తులకు అందజేశారు.