ఇరువర్గాల మధ్య వివాదాస్పదంగా తయారైన జ్ఞానవాపీ మసీదు సెల్లార్ లో ఎలాంటి పూజలు, ప్రార్థనలు చేయరాదంటూ సుప్రీంకోర్టు స్టే విధించింది. వారణాసి కాశీ విశ్వేశ్వరుడి సన్నిధికి సమీపంలోని జ్ఞానవాపి మసీదు సెల్లార్ లో పూజలు నిర్వహించుకోవచ్చని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మసీదు కమిటీ సర్వోన్నత న్యాయస్థానాన్ని(Supreme Court) ఆశ్రయించింది.
త్రిసభ్య ధర్మాసనం…
చీఫ్ జస్టిస్(CJI) డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట కేసు విచారణ(Hearing)కు వచ్చింది. ఈ జనవరి 17 నుంచి 31 వరకు ముస్లింలు ప్రార్థనలు చేసుకున్నారని, ‘తెఖానా’ ప్రాంతంలో హిందువులు సైతం పూజలు చేశారని సుప్రీంకోర్టు గుర్తించింది. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇరు వర్గాలు ఎలాంటి మత సంబంధిత కార్యక్రమాలు చేపట్టవద్దంటూ సుప్రీంకోర్టు స్టేటస్ కో ఆదేశాలిచ్చింది.
సెల్లార్ లో పూజలు చేసుకోవచ్చంటూ సెషన్స్ కోర్టు జనవరి 31న ఇచ్చిన ఆదేశాల్ని అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. దీన్ని సవాల్ చేస్తూ మసీదు కమిటీ సుప్రీంలో పిటిషన్ వేసింది.