
దేవాలయాలు, మఠాలలో మతపరమైన ఆంక్షలు హిందూమతంపై ప్రతికూల ప్రభావం చూపి, సమాజాన్ని విభజించగలవని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. శబరిమలతోపాటు మతపరమైన ప్రదేశాల్లో మహిళలపై వివక్ష, మత స్వేచ్ఛ పిటిషన్లపై సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎదుట వాదనలు జరిగాయి. ఒక మత సంస్థకు దాని సొంత వ్యవహారాలు నిర్వహించుకునే హక్కు ఉందని, రాష్ట్ర ప్రభుత్వానికన్నా నిర్వహణ కమిటీకే ఎక్కువ బాధ్యత ఉంటుందని శబరిమల తరఫున సి.ఎస్. వైద్యనాథన్ వాదించారు. శబరిమలలో భక్తుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవంటూ క్రైస్తవులు, ముస్లింలకు అయ్యప్పపై విశ్వాసం ఉంటే అనుమతిస్తారన్నారు. ప్రైవేటుగా హక్కులున్నాయన్న వాదనపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరికీ ఆలయాలు, మఠాల్లో ప్రవేశం ఉండాలని స్పష్టం చేసింది.