కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సమర్పించే లడ్డూను భక్తులు(Pilgrims) ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ లడ్డూకి 309 సంవత్సరాల చరిత్ర ఉండగా ఇది 1715లో ప్రారంభమైంది. తొలుత బూందీని తీపి ప్రసాదంగా పంచిన కాలం నుంచి లడ్డూగా మారే దాకా సాగింది ప్రస్థానం. ఆవు నెయ్యి, శనగపిండి, చక్కెర, పటిక బెల్లం సహా వివిధ పదార్థాలతో రోజూ 3 లక్షలకు పైగా లడ్డూలు తయారు(Making) చేస్తారు. ఆవు నెయ్యి క్వాలిటీ, సువాసనే కీలకం కాగా.. దీనికున్న విశిష్టత కారణంగా ‘జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్’ను TTD రిజిస్టర్ చేసింది.
TTD మినహా మరెవరూ తయారు చేయడం, అమ్మడం నేరంగా 2009లో లడ్డూ పేటెంట్ పొందారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన లడ్డూ నాణ్యత(Quality)పై ఈ మధ్య అనుమానాలు ఏర్పడ్డాయి. పొద్దున సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు స్వామి వారికి పలు రకాల్లో నైవేద్యాలు తయారు చేసే వైష్ణవులే లడ్డూ రూపకర్తలు. ఒక పడి(51 లడ్డూలు) ఉండగా.. కాలక్రమేణా అనేక పడులు పెంచుకుంటూ పోయారు. ఉదయం శ్రీవారికి నివేదించిన తర్వాత, ఆ ప్రసాదాన్ని మిగతా లడ్డూల్లో కలిపి భక్తులకు అందిస్తారు.
శ్రీవారి లడ్డూల్లో 3 రకాలుండగా.. కళ్యాణం(పెద్ద) లడ్డూ, ఆస్థానం(ఉగాది, ఆణివార, దీపావళి ఆస్థానాలు జరిగినపుడు) లడ్డూను అందిస్తారు. ఇక ఎప్పుడూ భక్తులకు అందుబాటులో ఉండేదే చిన్న లడ్డూ. పెద్ద లడ్డూ, ఆస్థానం లడ్డూ సైజ్ ఒకేలా ఉండగా.. కళ్యాణోత్సవంలో మాత్రమే స్వామి వారికి పెద్ద లడ్డూ నివేదనగా సమర్పిస్తారు. నిత్యం(Daily) పొద్దున, రాత్రి సమర్పించే నివేదనలో చిన్న లడ్డూనే సమర్పిస్తుంటారు.