
తిరుపతి(Tirupati) లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. నెల్లూరు ACB కోర్టుకు CBI అందజేసిన రిమాండ్ రిపోర్ట్ లో ఈ వివరాలున్నాయి. చుక్క పాలు లేకున్నా ఉత్తరాఖండ్ భగవాన్ పూర్లోని భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ నుంచి 2019-2024 మధ్య TTDకి 68 లక్షల కిలోల నెయ్యి సరఫరా అయింది. పోమిల్ జైన్, విపిన్ జైన్ కు చెందిన డెయిరీ ఒక్క చుక్క పాలు లేదా వెన్న సేకరించలేదని తేల్చింది. అయినా TTDకి ఐదేళ్ల పాటు రూ.250 కోట్ల విలువైన కల్తీ నెయ్యి సరఫరా అయింది. మోనోడిగ్లీసెరైడ్స్, అసెటిక్ యాసిడ్ ఈస్టర్ రసాయనాలతో నెయ్యి తయారైంది.
మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుని ఢిల్లీకి చెందిన బడ్జెస్ అండ్ బడ్జెస్ కంపెనీ నుంచి హర్ష్ ఫ్రెష్ డెయిరీ పేరుతో పెద్దమొత్తంలో పామాయిల్, పామ్ కెర్నెల్ నూనెను సంపాదించారు. ఢిల్లీకి చెందిన అరిస్టో కెమికల్స్ నుంచి లాక్టిక్ యాసిడ్, బీటా కెరోటిన్, కృత్రిమ నెయ్యి ఎసెన్స్ ను సేకరించారు. ఇదంతా భోలే బాబా డెయిరీకి చేరి అక్కడ కల్తీ నెయ్యి తయారైనట్లు రిపోర్టులో వివరించారు.