డీజేల జోరు.. రికార్డింగ్ డ్యాన్సుల హోరు.. బడి(School), గుడి(Temple) అని తేడా లేకుండా మండపం కనిపిస్తే చాలు సినిమా పాటలతో హంగామా.. ఇదీ ఏడాది, రెండేళ్ల క్రితం వరకు గణేశ్ మండపాల్లో పరిస్థితి. కానీ ఇప్పుడు మైకులు మూగబోయి.. ఎటు చూసినా భక్తిభావన వెల్లివిరుస్తున్నది. గణపతి నవరాత్రులంటే ఇలా ఉండాలి అన్న భావన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నది. ఉదయం, సాయంత్రం విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించడం, భక్తులకు ప్రసాదం పంచడం వంటి కార్యక్రమాలు ఎలాంటి హడావుడి లేకుండా సాగుతున్నాయి.
ఈసారి అతి ముఖ్యమైన విషయమేంటంటే పల్లె, పట్టణమనే తేడా లేకుండా అన్నదానం నిర్వహించడం. చాలా మండపాల వద్ద మధ్యాహ్నం వేళ అన్నదానం నిర్వహిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కొన్నిచోట్ల నిర్వాహకులే నిర్వహిస్తే.. కొన్ని గ్రామాల్లో ప్రజలే స్వచ్ఛందంగా భోజనం పెడుతున్నారు. ఇక హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ఐదు రోజులకు నిమజ్జనం చేస్తుంటారు. ఈ నిమజ్జనంలో డీజేలు, రికార్డింగ్ డ్యాన్సులతో చెవులు చిల్లులు పడేవి. కానీ ఈసారి అవి మచ్చుకైనా కనిపించడం లేదు. బ్యాండు మేళంతో, సంప్రదాయ నృత్యాలతోనే గణేశుణ్ని నిమజ్జనానికి తరలిస్తూ ఔరా అనిపిస్తున్నారు.