
జనన ధ్రువీకరణ(Birth Registrations) విషయంలో మన దేశం ఇంకా పూర్తి సాధికారత సాధించడం లేదు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను పరిశీలిస్తే సగటున 89 శాతం మంది మాత్రమే బర్త్ రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5(NFHS) ప్రకటించింది. ఇందులో 75% మంది సర్టిఫికెట్లు తీసుకుంటుండగా మిగతా 25 శాతం మంది వాటికి దూరంగా ఉంటున్నారని తేలింది. పుట్టిన 5 సంవత్సరాల లోపు జనన ధ్రువీకరణ చేపట్టాల్సి ఉండగా.. దానిపై చాలా మంది శ్రద్ధ పెట్టడం లేదని గుర్తించింది. కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్రమే అది 100% అమలవుతున్నదని, మరో మూడు రాష్ట్రాల్లో కనీసం 80% శాతం కూడా లేదట. మిగతా 11% అయితే రిజిస్టర్ చేసుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో 90%నికి పైగా
బర్త్ రిజిస్ట్రేషన్ల విషయంలో తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశే కాస్త ముందంజలో ఉంది. అక్కడ 92% పిల్లల పేర్లను రిజిస్టర్ చేయిస్తే తెలంగాణలో 90% మంది మాత్రమే అందుకు ముందుకు వస్తున్నట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతాలైన లక్ష్యదీప్, గోవాల్లో మాత్రమే 100% రిజిస్టర్ అవుతుండగా… 21 రాష్ట్రాలు, వివిధ కేంద్రపాలిత ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు 95%గా ఉన్నాయి. బిహార్ లో 76%, జార్ఖండ్ లో 74%, నాగాలాండ్ లో 73% మంది మాత్రమే రిజిస్టర్ చేసుకుంటున్నారు.