వేలి కొనపై తీసే చుక్క రక్తపు(Blood) బొట్టుతో ఎలాగైతే మధుమేహం(Sugar) పరీక్షలు జరుపుతున్నారో ఇప్పుడు అదే మాదిరిగా ఓ పెద్ద వ్యాధిని కనుగొనే అవకాశం రాబోతున్నది. ఇదే సాకారమైతే కోట్ల మంది బాధితుల(Victims)కు భవిష్యత్తులో ఒక వరం కాబోతున్నది. మధుమేహం తరహాలోనే అదే రక్తపు బొట్టుతో ఏకంగా రొమ్ము క్యాన్సర్(Breast Cancer)ను కనిపెట్టే దిశగా చేసిన పరిశోధనలు సఫల(Success)మయ్యాయి. ఈ పరిశోధనకు కేంద్రంగా హైదరాబాద్ నిలవడం గర్వకారణంగా నిలవబోతున్నది.
CCMBదే ఘనత…
రొమ్ము క్యాన్సర్ పరిశోధనలో హైదరాబాద్ లోని సీసీఎంబీ(Centre For Cellular And Molecular Biology) సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. చుక్కబొట్టు రక్తంతోనే ఈ వ్యాధిని గుర్తించే బయోమార్కర్ ను గుర్తించింది. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన అనంతరం ఈ విధానాన్ని మరింత డెవలప్ చేసే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. CCMBలోని క్యాన్సర్ బయాలజీ డిపార్ట్ మెంట్ కు చెందిన శాస్త్రవేత్తలు ఈ కొత్త సిస్టమ్ కు నాంది పలికారు.
బయాప్సీ ద్వారా పోల్చి చూసి…
రొమ్ములోని కణజాలాన్ని తీసుకుని చేసిన బయాప్సీ(Biopsy) పరీక్షలను.. రక్త నమూనాలతో చేపట్టిన కంప్యూటర్ ఆధారిత టెస్టులతో పోల్చిచూశారు. రెండింటిలోనూ ఒకే రకమైన ఫలితాలు వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు. దీనిపై మరింత ఎక్స్ పరిమెంట్స్, క్లినికల్ ట్రయల్స్ అవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇదే సాకారమైతే మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళలకు వరంగా మారనుంది. ఏటా వేల సంఖ్యలో మహిళలు రొమ్ము క్యాన్సర్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ముందస్తు పరీక్షలు లేక, సరైన అవగాహన కల్పించలేని పరిస్థితుల్లో మహమ్మారితో మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి వారికి ఈ తరహా ప్రయోగం ఎంతో ఉపయోగపడనుంది.